Gujarat Polls: 12 మంది రెబల్స్‌ను సస్పెండ్‌ చేసిన భాజపా

గుజరాత్‌లో సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న భాజపాను ఈసారి రెబల్స్‌ బెడద వెంటాడుతోంది. పార్టీ తరఫున టికెట్‌ దక్కనివారు స్వతంత్రులుగా బరిలోకి దిగడం పార్టీకి సవాలుగా మారింది.

Published : 24 Nov 2022 02:03 IST

సూరత్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు (Gujarat Assembly Elections) సమయం దగ్గరపడుతోన్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇదే సమయంలో సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న భాజపాను ఈసారి రెబల్స్‌ సమస్య వెంటాడుతోంది. పార్టీ తరఫున టికెట్‌ దక్కనివారు స్వతంత్రులుగా బరిలోకి దిగడం పార్టీకి సవాలుగా మారింది. వీటిని తీవ్రంగా పరిగణిస్తోన్న భాజపా.. క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 12 మంది రెబల్స్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్‌ 1, 5 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. వీటికి నామినేషన్‌, ఉపసంహరణ గడువు ఇటీవలే ముగిసింది. అయినప్పటికీ టికెట్‌ను ఆశించి భంగపడి, స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌ దాఖలు చేసిన భాజపా నేతలు మాత్రం తమ నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. దీన్ని తీవ్రంగా పరిగణించిన భాజపా.. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆదివారం ఏడుగురు నేతలను పార్టీ నుంచి తొలగించింది. తాజాగా మరో 12 మందిని ఆరేళ్లపాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ ప్రకటించారు. ఇందులో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మధు శ్రీవాస్తవ్‌, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

27 ఏళ్లుగా అధికారంలో ఉన్న భాజపాకు ఈసారి ఆమ్‌ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌, ఆప్‌లు తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు, ఉచిత విద్యుత్‌, నిరుద్యోగ భృతిలాంటి ఉచిత తాయిలాలు, పాత పింఛను పథకం అమలులాంటి హామీలను ఇరు పార్టీలు గుప్పించాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న దిల్లీ, పంజాబ్‌ల్లో తాము అనుసరిస్తున్న విద్య, ఆరోగ్య పథకాలను కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ బలంగా ప్రచారం చేసుకుంటోంది. ఉచితాలకు వ్యతిరేకమంటోన్న భాజపా మాత్రం ఎటువంటి హామీలు ఇస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని