Gujarat Polls: జామ్‌నగర్‌లో జడేజాల పోరు.. భార్య తరఫున రవీంద్ర.. పార్టీ కోసం సోదరి

గుజరాత్‌ ఎన్నికల్లో భాగంగా జామ్‌నగర్‌ అసెంబ్లీ స్థానంలో ఆసక్తికర ప్రచారం కొనసాగుతోంది. ప్రముఖ క్రికెటర్‌ రవీంద్ర జడేజా ఆయన సతీమణి తరఫున ప్రచారం నిర్వహిస్తుండగా.. జడేజా సోదరి మాత్రం కాంగ్రెస్‌ తరఫున ముమ్మరం ప్రచారం చేస్తూ సొంత వదినపైనే విమర్శలు గుప్పిస్తున్నారు.

Published : 28 Nov 2022 01:43 IST

జామ్‌నగర్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో.. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వేర్వేరు పార్టీల తరఫున ప్రచారాల్లో మునిగిపోయి.. ఒకరిపై ఒకరు విమర్శలు, ఫిర్యాదులు చేసుకుంటున్న ఘటనలు కనిపిస్తున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ క్రికెటర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja), ఆయన సోదరి చేరిపోయారు. భార్య తరఫున (BJP) రవీంద్ర జడేజా రోడ్డు షోలు నిర్వహిస్తుండగా.. ఆయన సోదరి (Naynaba Jadeja) మాత్రం కాంగ్రెస్‌ తరఫున విస్తృత ప్రచారం చేపడుతూ సొంత వదినపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా తోబుట్టువుల ప్రచారంతో జామ్‌నగర్‌ నార్త్‌ పోరు ఆసక్తికరంగా సాగుతోంది.

రవీంద్ర జడేజా భార్య రవాబా జడేజాను జామ్‌నగర్‌ నార్త్‌ స్థానం నుంచి భాజపా ఎన్నికల బరిలో దించింది. ఆయన సోదరి నయ్‌నబా కాంగ్రెస్‌ పార్టీ తరఫున వేరే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే, జడేజా సతీమణికి భాజపా టికెట్‌ కేటాయించిన వెంటనే నయ్‌నబాను స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాలో చేర్చిన కాంగ్రెస్‌.. జామ్‌నగర్‌లో ప్రచారానికి పంపింది. దీంతో కాంగ్రెస్‌ నేత బిపేంద్రసిన్హ్‌ జడేజాకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ.. సొంత వదినపైనే ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగానికి భాజపా విధానాలే కారణమంటూ మండిపడుతున్నారు.

2017 ఎన్నికల్లో జామ్‌నగర్‌ నార్త్‌లో భాజపా సీనియర్‌ నేత ధర్మేంద్రసిన్హ్‌ జడేజా భారీ మెజారిటీతో గెలుపొందారు. అయినప్పటికీ ఈసారి ఆయనకు కాకుండా రివాబాకు భాజపా సీటు కేటాయించింది. ధర్మేంద్రసిన్హ్‌కు పార్టీలో వేరే బాధ్యతలు అప్పగించింది. ఇలా జామ్‌నగర్‌ నార్త్‌లో బరిలో ఉన్న ఇద్దరు నేతలు రాజ్‌పుత్‌ వర్గానికి చెందిన వారే అయినప్పటికీ.. ఆ ప్రాంతంలో ముస్లిం ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. రివాబా గెలుపుపై భాజపా కార్యకర్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఇద్దరి  మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ స్థానంలో స్వల్ప తేడాతోనే గెలుపోటములు తేలుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు