Gujarat polls: ప్రతి బూత్‌లోనూ భాజపానే గెలవాలి : గుజరాత్‌ ఓటర్లకు మోదీ పిలుపు

గుజరాత్‌లో ప్రతి పోలింగ్‌ బూత్‌లోనూ భాజపానే గెలవాలని ప్రధాని మోదీ అక్కడి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఓటర్లు భారీ స్థాయిలో తరలివచ్చి మునుపటి రికార్డులను తిరగరాయాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లాలో నరేంద్ర మోదీ పర్యటించారు.

Published : 20 Nov 2022 14:57 IST

గాంధీనగర్‌: గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ప్రధాని మోదీ స్వరాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేశారు. ఈ సందర్భంగా గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లాలో పర్యటించిన ఆయన.. ప్రతి పోలింగ్‌ బూత్‌లోనూ భాజపానే గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

‘ప్రతి బూత్‌లోనూ భాజపా గెలవాలి. నా కోసం ఇది చేస్తారా..? ఈసారి అన్ని పోలింగ్‌ బూత్‌లలో గెలవడంపైనా దృష్టి పెట్టాను. ఈ విషయంలో మీరు సహకరిస్తే.. ఈ జిల్లాలోని నలుగురు భాజపా నేతలు అసెంబ్లీకి చేరతారు’ అని గిర్‌ సోమ్‌నాథ్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రచారంలో భాగంగా గుజరాత్‌లో పర్యటిస్తోన్న ఆయన.. ఆదివారం ఉదయం అక్కడి ప్రముఖ సోమ్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం సమీపంలోని వెరావల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. పోలింగ్‌ రోజున పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి.. మునుపటి పోలింగ్‌ రికార్డులను తిరగరాయాలని సూచించారు.

ఇదిలాఉంటే, 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 1న 89 స్థానాలకు, 5వ తేదీన 93 చోట్ల పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని