Andhra News: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే తెలంగాణతో చర్చలా?: జీవీఎల్‌

విభజన సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17న జరిగే సమావేశం ఎజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంశాఖ ప్రస్తావించడంపై భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు

Updated : 12 Feb 2022 18:33 IST

దిల్లీ: విభజన సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17న జరిగే సమావేశం ఎజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంశాఖ ప్రస్తావించడంపై భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ట్విటర్‌లో స్పందించారు. వైకాపా ఎంపీలు ఏదో సాధించారని టీవీల్లో విని చాలా సంతోషించానన్న జీవీఎల్‌.. కేంద్ర హోంశాఖ నోట్‌పై ఆరా తీశానని చెప్పారు. ప్రత్యేక హోదా అంశం రెండు రాష్ట్రాల కమిటీ ఎజెండాలో ఉండేది కాదని తెలిసిందని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే తెలంగాణతో చర్చించాలా? అన్న జీవీఎల్‌ ..ఈ విషయం ఆలోచిస్తే అర్ధమవుతుందని ట్వీట్‌ చేశారు. కేంద్ర హోంశాఖ నోట్‌ను తాను చూశానని, అధికారులతో మాట్లాడానని ఆతరువాతే వివరణ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు.

‘‘ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటుపై చర్చ ఉంటుందని ప్రస్తావించిన తరుణంలో దీనిపై స్పష్టత తీసుకోవడం కోసం కేంద్రంలోని సీనియర్‌ అధికారులతో మాట్లాడాను. ప్రత్యేక హోదా అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన అంశం కాదు. ఇది కేవలం అంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశం మాత్రమే. రెవెన్యూ లోటు కూడా ఏపీకి మాత్రమే సంబంధించిన అంశం. ఈ రెండు అంశాలు జాబితాలోకి ఎలా వచ్చాయని వాకబు చేస్తే.. ఈ కమిటీ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆర్థిక పరమైన విషయాల్లో ఎక్కడ విభేదాలు ఉన్నాయో.. అవి పరిష్కరించడానికి మాత్రమే ఏర్పాటైన కమిటీ. ఇందులో ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు అంశాలపై చర్చకు ఆస్కారం లేదని తెలిసింది. కానీ, ప్రస్తుతం మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రజల్ని తప్పుదోవపట్టించే విధంగా ఉంది. అందుకే ఈ వివరణ ఇస్తున్నా’’ అని జీవీఎల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని