Maharashtra: రెబల్స్‌లో సగం మంది మాతో టచ్‌లోనే..: సంజయ్‌ రౌత్‌

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ఇప్పుడప్పుడే తెరపడేలా కన్పించట్లేదు. శివసేన అధిపతి ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన ఏక్‌నాథ్‌ శిందే వర్గ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో

Published : 28 Jun 2022 11:26 IST

ముంబయి: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ఇప్పుడప్పుడే తెరపడేలా కన్పించట్లేదు. శివసేన అధిపతి ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన ఏక్‌నాథ్‌ శిందే వర్గ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో శిందే వర్గం మరికొద్ది రోజులు గువాహటి హోటల్‌లోనే ఉండనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, అసమ్మతి ఎమ్మెల్యేలపై ఇటీవల తీవ్రంగా విరుచుకుపడ్డ సంజయ్‌ రౌత్‌.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రెబల్స్‌తో సగం మంది తమతో టచ్‌లోనే ఉన్నారని తెలిపారు.

ఈ ఉదయం సంజయ్‌ రౌత్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రెబల్‌ ఎమ్మెల్యేల్లో సగానికి పైగా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు. వారిని అక్కడ బలవంతంగా నిర్బంధించారు. వారి మద్దతు మాకే ఉంది. వారు తప్పకుండా ఠాక్రే వర్గంలోకి తిరిగొస్తారు’’ అని వ్యాఖ్యానించారు.

జులై 5 వరకు హోటల్‌ బుకింగ్‌..

శిందే వర్గం ఉండేందుకు రాడిసన్‌ హోటల్‌లో తొలుత జూన్‌ 30 వరకు గదులను బుక్‌ చేశారు. అయితే, తాజాగా ఆ బుకింగ్‌లను జులై 5 వరకు పొడిగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై మహా డిప్యూటీ స్పీకర్‌ జారీ చేసిన అనర్హత నోటీసులకు సమాధానమిచ్చేందుకు సుప్రీంకోర్టు జులై 12 వరకు గడువు పొడిగించింది. దీంతో వీరంతా మరికొంత కాలం గువాహటిలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

రెబల్స్‌తో శిందే కీలక భేటీ..

తాజా పరిణామాల నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలతో ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఏక్‌నాథ్‌ శిందే సమావేశం కానున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరంతా గవర్నర్‌ను కలవనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు అసెంబ్లీలో ఠాక్రే విశ్వాస పరీక్షను ఎదుర్కొనే పరిస్థితి రావొచ్చని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని