AAP: మాజీ క్రికెటర్‌, ప్రొఫెసర్‌, ఎమ్మెల్యే.. ఆమ్‌ ఆద్మీ రాజ్యసభ సభ్యులు వీరే..

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ తాజాగా రాజ్యసభలోనూ తమ సంఖ్యను పెంచుకునేందుకు సిద్ధమైంది. పంజాబ్‌లో  ఐదు రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.

Published : 22 Mar 2022 01:18 IST

చండీగఢ్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ తాజాగా రాజ్యసభలోనూ తమ సంఖ్యను పెంచుకునేందుకు సిద్ధమైంది. పంజాబ్‌లో  ఐదు రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత మెజార్టీని బట్టి ఈ ఐదు స్థానాలు ఆప్‌కే దక్కనున్నాయి. దీంతో ఈ స్థానాలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ నేడు అభ్యర్థులను ప్రకటించింది. మాజీ క్రికెటర్‌, ప్రొఫెసర్‌, ఎమ్మెల్యే, విద్యావేత్త ఇలా అన్ని రంగాల వారికి ప్రాధాన్యమిస్తూ అభ్యర్థులను ఖరారు చేసింది.

ఊహాగానాలను నిజం చేస్తూ మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ను రాజ్యసభ సీటు కేటాయించింది. ఆయనతో పాటు ఆప్‌ దిల్లీ ఎమ్మెల్యే రాఘవ్‌ చద్దా, ఐఐటీ దిల్లీ ప్రొఫెసర్‌ సందీప్‌ పాథక్‌, వాణిజ్యవేత్త సంజీవ్‌ అరోడా, విద్యావేత్త అశోక్‌ కుమార్‌ మిట్టల్‌ పేర్లను ప్రకటించింది. వీరంతా సోమవారం పంజాబ్‌ విధానసభ కాంప్లెక్స్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. హర్భజన్ సింగ్‌ పసుపు రంగు తలపాగాతో వచ్చి నామినేషన్‌ వేశారు. ‘‘బౌలింగ్‌ లెజెండ్‌గా భారత్‌కు గర్వకారణం అయిన మిస్టర్‌ టర్బొనేటర్‌.. ఇప్పుడు పార్లమెంట్‌లో పంజాబ్‌ ప్రజల తరఫున గళమెత్తనున్నారు’’ అని ఆమ్‌ ఆద్మీ పార్టీ ట్విటర్‌లో రాసుకొచ్చింది. 

పంజాబ్‌లో 117 స్థానాలకు గానూ 92 సీట్లను ఆప్‌ గెలుచుకుంది. దీంతో ఐదు రాజ్యసభ స్థానాలను ఆమ్‌ ఆద్మీ ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశముంది. ఈ స్థానాలతో రాజ్యసభలో ఆప్‌ బలం మూడు నుంచి ఎనిమిదికి పెరగనుంది. 

హర్భజన్‌ సింగ్‌:

ఇటీవలే క్రికెట్‌ నుంచి వీడ్కోలు ప్రకటించిన భజ్జీ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. హర్భజన్‌ రాకపై పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే ప్రచారం మొదలైంది. ఆ మధ్య ఆయన కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూను కలిశారు. దీంతో ఆయన హస్తం పార్టీలో చేరడం ఖాయమనే వార్తలు వినిపించాయి. అయితే వాటిని ఆయన కొట్టిపారేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలిచిన తర్వాత భగవంత్‌మాన్‌ తన తల్లిని హత్తుకున్న ఫొటోను భజ్జీ షేర్‌ చేస్తూ అభినందనలు తెలిపారు. దీంతో ఆయన ఆప్‌లో చేరడం ఖాయమే అని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో భజ్జీతో చర్చలు జరిపిన ఆప్‌.. ఆయనను రాజ్యసభకు పంపిస్తోంది.

రాఘవ్‌ చద్దా..

దిల్లీలోని రాజేంద్ర నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాఘవ్‌ చద్దాను ఆమ్‌ ఆద్మీ పార్టీ 2020లో పంజాబ్ కో ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. పంజాబ్‌లో ఆప్‌ గెలుపునకు కీలక పాత్ర పోషించిన వారిలో చద్దా కూడా ఒకరు. దీంతో తాజాగా ఆయన్ను రాజ్యసభకు పంపాలని నిర్ణయించింది. 33 ఏళ్ల రాఘవ్‌ చద్దా.. ఇప్పటివరకు అతి పిన్న వయసులో రాజ్యసభకు ఎంపికైన ఎంపీగా ఘనత సాధించనున్నారు. అంతకుముందు మేరీ కోమ్ ‌35 ఏళ్ల వయసులో, రీటాబత్రా బెనర్జీ 34 ఏళ్ల వయసులో పెద్దల సభకు ఎన్నికయ్యారు.

సందీప్‌ పాథక్‌: 

ఐఐటీ దిల్లీలో భౌతిక శాస్త్రం ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న సందీప్‌ పాథక్‌.. పంజాబ్‌లో పార్టీ పురోగతి, విజయంలో నిర్మాణాత్మక పాత్ర పోషించారు. పంజాబ్‌ సీఎం, అరవింద్‌ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు. గత మూడేళ్లుగా పంజాబ్‌లోనూ ఉంటూ క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అందుకు ప్రతిఫలంగా ఆయనను రాజ్యసభకు పంపించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ నిర్ణయించింది.

అశోక్‌ మిత్తల్‌: 

పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు, ఛాన్సలర్‌ అయిన అశోక్‌ మిత్తల్ విద్యావేత్త, సామాజిక కార్యకర్త కూడా. ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజకీయ అజెండాలో విద్యకు కీలక ప్రాధాన్యమిస్తోన్న నేపథ్యంలో అశోక్‌ మిత్తల్‌ను రాజ్యసభకు పంపాలని పార్టీ భావించి ఆయనకు టికెట్‌ ఇచ్చింది. 

సంజీవ్‌ అరోడా: 

లూధియానాకు చెందిన పారిశ్రామికవేత్త సంజీవ్‌ అరోడా.. కృష్ణ ప్రాణ్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ను నిర్వహిస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఈ ట్రస్ట్‌ ద్వారా ఏటా 160 మందికి పైగా క్యాన్సర్‌ రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ఆయన సేవలకు మెచ్చి ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆయనను రాజ్యసభకు పంపించాలని నిర్ణయించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని