Hardik Patel: కాంగ్రెస్‌కు గట్టి షాక్‌.. రాజీనామా ప్రకటించిన హార్దిక్ పటేల్‌

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ తగిలింది. పటేల్ వర్గానికి చెందిన కీలక నేత హార్దిక్ పటేల్ హస్తం పార్టీని వీడారు.

Published : 18 May 2022 12:46 IST

సోనియాకు రాసిన సుదీర్ఘ లేఖలో రాహుల్‌పై విమర్శలు

దిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ తగిలింది. పటేల్ వర్గానికి చెందిన కీలక నేత హార్దిక్ పటేల్ (Hardik Patel) హస్తం పార్టీని వీడారు. ‘కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి, పార్టీ పదవికి రాజీనామా చేసేందుకు ఎంతో ధైర్యాన్ని కూటగట్టుకుంటున్నాను. నా నిర్ణయాన్ని నా సహచరులు, గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారని విశ్వసిస్తున్నాను. ఈ నిర్ణయంతో భవిష్యత్తులో నేను గుజరాత్ అభివృద్ధి కోసం పనిచేయగలనని నమ్ముతున్నాను’ అంటూ హార్దిక్ తన రాజీనామాను ట్విటర్ వేదికగా ప్రకటించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈ లేఖను పంపారు. 

సోనియాకు రాసిన సుదీర్ఘ లేఖలో.. ‘భారత్‌లో క్లిష్ట సమయాల్లో అవసరం ఉన్నప్పుడు మన నేత విదేశాల్లో ఉన్నారు’ అంటూ రాహుల్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. అలాగే రాహుల్ గుజరాత్ పర్యటనలో భాగంగా హార్దిక్ ఆయనతో సమావేశం కాలేకపోయారు. ‘నేను అగ్రనేతలను కలిసినప్పుడు వారు గుజరాత్‌కు సంబంధించిన సమస్యలు వినకుండా.. తమ మొబైల్‌ ఫోన్‌లు చూసుకుంటూ, ఇతర విషయాలతో పరధ్యానంలో ఉండిపోయారు. కాంగ్రెస్‌ నాయకత్వానికి గుజరాత్‌పై అంతగా ఆసక్తి లేదు. ప్రజల వద్దకు చేరుకోవడానికి ఆ పార్టీ వద్ద సరైన రోడ్ మ్యాప్ లేదు. అందుకే అది ప్రతిచోటా తిరస్కరణకు గురవుతోంది’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. 

పాటిదార్ ఉద్యమంతో ప్రజాదరణ పొందిన హార్దిక్ పటేల్.. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. ఇంతకాలం పార్టీలో కీలక స్థానంలో కొనసాగుతూ వచ్చారు. తనను కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్లక్ష్యం చేస్తోందని బహిరంగంగా వెల్లడించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ యూనిట్ నిర్వహించిన ఏ సమావేశానికీ తనను ఆహ్వానించలేదన్న ఆయన.. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలోనూ సంప్రదించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఆయన సొంతపార్టీపైనే విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో ఆయన భాజపా నాయకత్వంపై ప్రశంసలు కురిపించడంతో ఆ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ట్విటర్ బయోలో కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే హోదాను తొలగించారు. ఈ పరిణామాల మధ్యనే తమతో చేరండంటూ ఆమ్ ఆద్మీ పార్టీ  ఆయన్ను ఆహ్వానించింది. మరి ఈయన మొగ్గు ఎటువైపు ఉంటుందో చూడాలి. 

ఇదిలా ఉంటే.. కొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో పటేల్‌ పార్టీని వీడటం కాంగ్రెస్‌కు గట్టి దెబ్బే. అలాగే చింతన్‌ శిబిరం పేరిట భారీ మార్పులు చేపట్టేందుకు హస్తం పార్టీ ముందుకు వచ్చింది. ఈ సమయంలో కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. శిబిరం నడుస్తోన్న వేళే సీనియర్‌ నేత, పంజాబ్‌ పీసీసీ మాజీ చీఫ్‌ సునీల్‌ జాఖఢ్‌ పార్టీని వీడారు. ఇప్పుడు ఆ జాబితాలో హార్దిక్ చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని