Telangana News: భాజపా అధికారంలోకి వస్తుందనేది ఆ పార్టీ నేతల పగటికల: హరీశ్‌రావు

తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందనేది ఆ పార్టీ నేతల పగటికల అని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ప్రధాని మోదీకి లేదన్నారు

Published : 26 May 2022 19:46 IST

హైదరాబాద్‌: తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందనేది ఆ పార్టీ నేతల పగటికల అని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ప్రధాని మోదీకి లేదన్నారు. 8 ఏళ్లలో తెలంగాణకు భాజపా ఇచ్చిందేమిటో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చే పార్టీ తెరాస అని ధీమా వ్యక్తం చేశారు. భాజపా చేసేది గోరంత.. చెప్పేది కొండంత అని ఎద్దేవా చేశారు. గ్యాస్‌ సిలిండర్‌పై రాయితీ ఎత్తేశారని మండిపడ్డారు. ఇది గుజరాత్ కాదు.. పోరాటాల గడ్డ తెలంగాణ అని ప్రధాని గుర్తుంచుకోవాలన్నారు. ఇతర పార్టీల నుంచి వారసులను భాజపాలో ఎందుకు చేర్చుకుంటున్నారు? వారసులను భాజపాలో చేర్చుకుంటే తప్పులేదా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ.. ఆయన స్థాయికి తగని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణను విచ్ఛిన్నం చేసేవారు నాడు ఉన్నారు.. నేడు ఉన్నారు.. అని హరీశ్‌రావు ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఓర్వలేని తనంతో ప్రధాని అలా మాట్లాడుతున్నారు: గంగుల కమలాకర్‌

‘‘ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్మారు. తెలంగాణ రాష్ట్రమన్నా, ఉద్యమ నేత కేసీఆర్ కుటుంబమన్నా భాజపా నేతలకు భయం పట్టుకుంది. కులాలు, మతాలు, వర్గాలను అడ్డుపెట్టుకొని భాజపా రాజకీయం చేస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో విద్వేషాలు రెచ్చగొట్టి నేతలు పబ్బం గడుపుకొన్నారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కర్ఫ్యూలు, విధ్వంసం ఉండేది. ఇవాళ సీఎం కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్‌ శాంతి భద్రతలతో అభివృద్ధి దిశగా పయనిస్తోంది. గుజరాత్ రాష్ట్రం కన్నా అన్ని రంగాల్లో తెలంగాణ ముందుందనే ఓర్వలేని తనంతో ప్రధాని మాట్లాడుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు. దేవుడిని గుండెల్లో పెట్టుకొని పూజించే వాళ్లం మేమైతే.. అదే దేవుడిని అడ్డుపెట్టుకొని భాజపా సెంటిమెంటు రాజకీయాలు చేస్తోంది. మోదీ అసమర్థ పాలనను తరిమికొట్టేందుకు, దేశ ప్రజలకు మంచి చేసేందుకు కేసీఆర్ యావత్‌ దేశ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు’’ అని గంగుల పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని