Telangana News: సంజయ్ అలా పిలుపునివ్వడం మిలీనియం జోక్‌ లాంటిది: హరీశ్‌రావు

తెలంగాణకు కేంద్రం నిధులపై భాజపా అబద్ధాలు ప్రచారం చేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదన్న కేటీఆర్ సవాల్‌పై భాజపా నేతలు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా వ్యక్తిగత విమర్శలకు...

Published : 24 Apr 2022 01:40 IST

హైదరాబాద్: తెలంగాణకు కేంద్రం నిధులపై భాజపా అబద్ధాలు ప్రచారం చేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదన్న కేటీఆర్ సవాల్‌పై భాజపా నేతలు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ గోబెల్స్‌ను మించిపోయి.. పాదయాత్రలో అన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.7,183 కోట్ల బకాయిలను కేంద్రం తొక్కిపెట్టిందన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం కనిపించడం లేదని.. కిషన్ రెడ్డికి చేతనైతే బకాయిలు ఇప్పించాలని డిమాండ్ చేశారు.

‘‘కర్ణాటక సీఎంతో మాట్లాడి తెలంగాణ పథకాలను తమకు ఇప్పించాలని రాయచూరు రైతులు పాదయాత్రలో బండి సంజయ్‌ని కోరుతున్నారు. రాష్ట్రాలను బలహీనపరిచే కుట్రకు కేంద్రం తెరలేపింది. సెస్‌ల రూపంలో రాష్ట్రాల ఆదాయాలకు గండి కొడుతోంది. ఆసరా పింఛన్లపై భాజపా నేతలు బోగస్ మాటలు మానుకోవాలి. తెలంగాణకు ఆసరా పింఛన్లలో కేంద్రం ఇచ్చింది కేవలం 3 శాతం లోపే. డీకే అరుణను ఆర్డీఎస్ అరుణగా పిలవాలని సంజయ్ పిలుపునివ్వడం మిలీనియం జోక్‌గా అభివర్ణించవచ్చు. ఆర్డీఎస్‌కు డీకే అరుణ అన్యాయం చేస్తే సీఎం కేసీఆర్ న్యాయం చేశారు. బండి సంజయ్, కిషన్ రెడ్డికి చేతనైతే తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు తేవాలి. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలపై బండి సంజయ్ సమాధానం చెప్పి పాదయాత్ర కొనసాగించాలి’’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని