Harish Rao: నిరుద్యోగులకిచ్చిన హామీలు అమలు చేయండి

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తీరుపై మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అసంతృప్తి వ్యక్తంచేశారు. గ్రూప్స్‌ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, క్యాబినెట్‌ సమావేశంలో వారికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురు చూశాం..

Updated : 23 Jun 2024 06:14 IST

గ్రూప్స్‌ అభ్యర్థుల డిమాండ్లు పరిష్కరించాలి
మొత్తం ఖాళీలతో మెగా డీఎస్సీ నిర్వహించాలి
సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ

హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తీరుపై మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అసంతృప్తి వ్యక్తంచేశారు. గ్రూప్స్‌ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, క్యాబినెట్‌ సమావేశంలో వారికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురు చూశాం.. కానీ వాటి గురించి ఎలాంటి చర్చ లేకుండా సమావేశం ముగించి ఉసూరుమనిపించారని విమర్శించారు. ఈ మేరకు పలు అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు శనివారం బహిరంగ లేఖరాశారు. ‘అభ్యర్థుల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చినందున గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించి వారికి న్యాయంచేయాలి. ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షల తేదీల మధ్య వ్యవధి ఎక్కువ ఉండేలా షెడ్యూల్‌ సవరించాలి. ప్రభుత్వంలోకి వచ్చిన ఏడాదిలోగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని ఇచ్చిన హామీకి అనుగుణంగా నోటిఫికేషన్లు జారీచేయాలి. మ్యానిఫెస్టోలో చెప్పిన దానికి కట్టుబడి మొత్తం ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించాలి. మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకున్న బకాయి మొత్తం సహా నిరుద్యోగ భృతి రూ.4 వేలు ప్రతినెలా చెల్లించాలి. వెంటనే జీవో 46 ద్వారా ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించి అభ్యర్థులకు న్యాయంచేయాలి’ అని హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు