Harish Rao: గాడి తప్పుతున్న విద్యావ్యవస్థను చక్కదిద్దండి

రాష్ట్రంలో గాడితప్పుతున్న విద్యావ్యవస్థను ప్రభుత్వం వెంటనే చక్కదిద్దాలని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు కోరారు.

Published : 08 Jul 2024 05:39 IST

ముఖ్యమంత్రికి హరీశ్‌రావు బహిరంగ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గాడితప్పుతున్న విద్యావ్యవస్థను ప్రభుత్వం వెంటనే చక్కదిద్దాలని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. అరకొర వసతులు, టీచర్ల లోటు, పాఠ్యపుస్తకాలు, దుస్తుల కొరత, తాగునీటి ఇబ్బందులు, వేతనాల చెల్లింపులో ఆలస్యం వంటి సమస్యలు తెలంగాణ విద్యావ్యవస్థను పట్టి పీడిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో మీరు కొత్తగా చేసిందేమీ లేకుండా పోయింది. గత ప్రభుత్వం చేస్తున్నవి కొనసాగించడంలోనూ మీ ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు భారాస ప్రభుత్వం ప్రారంభించిన ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని కొనసాగించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యానికి బదులు ముక్కిన బియ్యంతో భోజనం పెడుతున్నారు. విద్యార్థుల పోషకాహారం కోసం అందించే కోడిగుడ్ల బిల్లులు సైతం చెల్లించడం లేదు. రెండు జతల స్కూల్‌ యూనిఫామ్‌ ఇవ్వకుండా ఒక్క జత మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పాఠశాలల్లో దోమలు, ఈగలు ముసురుతున్నాయి. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయకపోవడంతో పాఠ్యాంశాలు పూర్తి కావడం ప్రశ్నార్థకంగా మారింది. కరెంట్‌ బిల్లులు చెల్లించకపోవడంతో అంధకారం అలుముకుంటున్నది. మీరు ఇప్పటికైనా స్పందించి తక్షణమే పాఠశాల విద్యను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకోవాలి’’ అని హరీశ్‌రావు తన లేఖలో సీఎంను కోరారు. 

మధ్యాహ్న భోజన బకాయిలు చెల్లించాం..
హరీశ్‌రావు లేఖపై విద్యాశాఖ వివరణ

ఈనాడు, హైదరాబాద్‌: మధ్యాహ్న భోజన బిల్లులకు సంబంధించి గత డిసెంబరు నాటికి పడిన బకాయిలు రూ.50 కోట్లతో పాటు అదనంగా మరో రూ.50.45 కోట్లను విడుదల చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. రూ.53.07 కోట్లు త్వరలోనే విడుదల కానున్నట్లు వెల్లడించింది. విద్యాశాఖ సమస్యలపై స్పందించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీమంత్రి హరీశ్‌రావు రాసిన లేఖకు స్పందిస్తూ ఈ మేరకు విద్యాశాఖ వివరణ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో 5,089 పోస్టులతో డీఎస్సీ విడుదల చేస్తే తాజాగా ఆ నోటిఫికేషన్‌ రద్దుచేసి 11,069 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని