Harish Rao: ఇదేనా భాజపా చెబుతోన్న అమృత్‌కాల్‌?: హరీశ్‌రావు ఫైర్‌

ఔషధాల ధరలు పెంచడం ఇది అత్యంత బాధాకరం.. దుర్మార్గం. ఇదేనా బాజపా చెబుతోన్న అమృత్‌ కాల్‌..? ఇవి అచ్చేదిన్‌ కాదు.. సామాన్యుడు సచ్చేదిన్‌ అంటూ హరీశ్‌రావు విరుచుకుపడ్డారు.

Updated : 30 Mar 2023 19:13 IST

హైదరాబాద్‌: ప్రజల ప్రాణాలను కాపాడే ఔషధాల ధరలను సైతం 12శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్యగా పేర్కొన్నారు.  వచ్చే నెల నుంచి ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచనుండటంపై ఆయన ట్విటర్‌లో మండిపడ్డారు. జ్వరం, ఇన్ఫెక్షన్‌, బీపీ, చర్మవ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో వాడే మందులతో పాటు పెయిన్‌ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌, యాంటీ ఇన్ఫెక్షన్స్‌ వంటి 800లకు పైగా నిత్యావసర మందుల ధరలు పెంచితే.. అది పేద, మధ్యతరగతి ప్రజలకు భారమవుతుందన్నారు.

సామాన్యుడిని ఇబ్బంది పెట్టడమే భాజపా ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు. అవకాశం దొరికిన ప్రతిసారీ పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచేసి ప్రజల నడ్డవిరుస్తోందని.. చివరకు జబ్బు చేస్తే ప్రాణాలను కాపాడే ఔషధాల ధరలను సైతం పెంచేందుకు సిద్ధమైందంటూ కేంద్రంపై హరీశ్‌ ఫైర్‌ అయ్యారు. ‘‘ఇది అత్యంత బాధాకరం.. దుర్మార్గమైన చర్య. ఇదేనా బాజపా చెబుతోన్న అమృత్‌ కాల్‌..? ఇవి అచ్చేదిన్‌ కాదు.. సామాన్యుడు సచ్చేదిన్‌.. దేశంలో భాజపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయి’’ అంటూ ధ్వజమెత్తారు. ఔషధాల ధరల్ని పెంచుతున్నట్టుగా వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లను తన ట్వీట్‌కు జత చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని