అది కాంగ్రెస్‌ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం: కుమారస్వామి

నూతన పార్లమెంట్‌ భవన (New Parliament Building) ప్రారంభోత్సవ కార్యక్రమంపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్‌ (Congress) పార్టీ తన రెండు నాల్కల ధోరణిని మరోసారి బయటపెట్టిందని జేడీఎస్ (JDS) నేత హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. 

Published : 27 May 2023 02:02 IST

బెంగళూరు: నూతన పార్లమెంట్‌ భవనం (New Parliament Building) ప్రారంభోత్సవానికి కాంగ్రెస్‌ (Congress) పార్టీ హాజరుకాకపోవడాన్ని జేడీఎస్‌ (KDS) నేత, కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) తప్పుబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ మరోసారి తన ద్వంద వైఖరిని ప్రదర్శిస్తోందని విమర్శించారు. కొన్ని వర్గాల వారి ఓట్లతో రాజకీయంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే కాంగ్రెస్‌ పార్టీ ఇలా చేస్తోందని ఆరోపించారు. మే 28న జరిగే నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జేడీఎస్‌ హాజరవుతుందని ఆ పార్టీ అధినేత హెచ్‌డీ దేవేగౌడ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాన్ని కుమారస్వామి తప్పుబట్టారు. 

‘‘నూతన పార్లమెంట్ భవనం ఏదో ఒక రాజకీయ పార్టీ నిధులతో నిర్మించింది కాదు. దేశంలో ఉన్న ఎంతోమంది పన్ను చెల్లింపుదారుల కట్టిన పన్ను సొమ్ముతో నిర్మించింది. ఛత్తీస్‌గఢ్‌   అసెంబ్లీ భవనానికి గవర్నర్‌ కాకుండా సోనియా, రాహుల్‌ గాంధీ శంకుస్థాపన చేశారు. కర్ణాటక విధానసౌధను 2005లో గవర్నర్‌ కాకుండా అప్పటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి ధరమ్‌సింగ్‌ ప్రారంభించారు. కాంగ్రెస్‌ పార్టీ రెండు నాల్కల ధోరణికి ఇదే నిదర్శనం. ఓట్ల కోసం ఆ పార్టీ  స్వార్థపూరిత రాజకీయాలకు పాల్పడుతోంది. కాంగ్రెస్‌ నిజంగా గిరిజన మహిళను గౌరవించాలనుకుంటే, ఆమెను ఎందుకు ఏకగ్రీవంగా ఎన్నుకోలేదు? కాంగ్రెస్‌ పార్టీ చౌకబారు రాజకీయాలతో తన ప్రతిష్ఠను దిగజార్చుకోవద్దు’’ అని కుమారస్వామి సూచించారు. 

నూతన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడాన్ని.. కాంగ్రెస్‌, ఆప్‌, టీఎంసీ సహా 19 విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ఈ మేరకు ఆ పార్టీలు పార్లమెంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకాబోమని ప్రకటించాయి. ఈ నిర్ణయాన్ని భాజపా సహా ఎన్డీయే భాగస్వామ్యపక్ష పార్టీలు తప్పుబట్టాయి. గత కొద్దిరోజులుగా పార్లమెంట్ ప్రారంభోత్సవం, రాజదండం గురించి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ మిత్రపక్షంగా వ్యవహరించిన జేడీఎస్‌ ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని