Sharad Pawar: ఉద్ధవ్‌కు రాజకీయ చతురత లేదు.. ఆత్మకథలో శరద్‌ పవార్ వ్యాఖ్య

ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray)లో రాజకీయ చతురత లోపించిందని ఎన్‌సీపీ అగ్రనేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) అన్నారు. ఈ మేరకు తన ఆత్మకథలో రాసుకొచ్చారు.

Published : 03 May 2023 20:04 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra) మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) తన సొంత పార్టీ శివసేనలో చెలరేగిన అసమ్మతిని చల్లార్చడంలో విఫలమయ్యారని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) అగ్రనేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) అన్నారు. ఓ ముఖ్యమంత్రికి ఉండాల్సిన రాజకీయ చతురత ఠాక్రేలో కొరవడిందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన తన ఆత్మకథ పుస్తకంలో పవార్‌ పేర్కొన్నారు.

‘‘మహా వికాస్‌ అఘాడీ కూటమి ఏర్పాటు కేవలం పవర్‌ గేమ్‌ మాత్రమే కాదు. ఇతర పార్టీలను తుడిచేయాలని చూస్తున్న భాజపా ధోరణిని అడ్డుకునేందుకు పుట్టుకొచ్చిన కూటమి. ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కుట్రలు జరుగుతాయని మేం ముందే ఊహించాం. కానీ ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన కారణంగా శివసేనలోనే తుపాను చెలరేగుతుందని అంచనా వేయలేకపోయాం. ఆ అసమ్మతిని పరిష్కరించడంలో సేన నాయకత్వం విఫలమైంది. ఎలాంటి పోరాటం చేయకుండానే (ఏక్‌నాథ్‌ శిందే, సేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన తర్వాత) ఉద్ధవ్‌ ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మహా వికాస్‌ అఘాడీ అధికారం ముగిసింది’’ అని పవార్‌ ఆ పుస్తకంలో రాసుకొచ్చారు.

‘‘ఓ ముఖ్యమంత్రికి రాజకీయ చతురత చాలా అవసరం. జరగబోతున్న రాజకీయ పరిణామాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, అంచనాలు వేసుకుంటూ ఉండాలి. అయితే ఈ చతురత ఠాక్రే (Uddhav Thackeray)లో కాస్త లోపించిందని నాతో సహా కొందరు భావించారు. అనుభవలేమి దీనికి కారణమై ఉండొచ్చు. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితులు కూడా అడ్డంకిగా మారి ఉండొచ్చు’’ అని శరద్‌ పవార్‌ అభిప్రాయపడ్డారు.

కొవిడ్‌ మహమ్మారి సమయంలో ఠాక్రే ప్రజలతో ఫేస్‌బుక్‌ లైవ్‌లో ప్రజలతో మాట్లాడి ధైర్యం చెప్పారని, అయితే మంత్రాలయకు వెళ్లకపోవడం కూడా నేతల్లో వ్యతిరేకతను పెంచిందన్నారు. పవార్‌ ఆత్మకథ రెండో ఎడిషన్‌ను మంగళవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదే కార్యక్రమంలో పవార్‌.. ఎన్‌సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని