Munugode Bypoll: ఓటర్ల జాబితాపై హైకోర్టులో విచారణ.. నివేదిక సమర్పించాలని ఎస్‌ఈసీకి ఆదేశాలు

మునుగోడు ఉప ఎన్నిక ఓటర్ల జాబితాపై దాఖలైన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా నమోదైన ఓటర్ల జాబితా నివేదికను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

Updated : 13 Oct 2022 15:06 IST

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ఓటర్ల జాబితాపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘ఉపఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో భారీగా ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల నమోదు చేపట్టారు. ఫార్మ్‌-6 ప్రకారం కొత్తగా దాదాపు 25వేల ఓట్లు నమోదయ్యాయి’’ అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఎన్నికల సంఘం తరపున అవినాష్‌ దేశాయ్ వాదనలు వినిపించారు. ‘‘తుది ఓటర్ల జాబితాను ఇంకా ఎన్నికల కమిషన్ ప్రకటించలేదు. ప్రతి సంవత్సరం కొత్త ఓటర్లు నమోదు చేసుకుంటారు. జనవరి 2021 వరకు 2.22 లక్షల ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో 2.38 లక్షల ఓట్లు ఉన్నాయి. కొత్తగా నమోదైన 25వేల ఓట్లలో 7 వేలు తొలగించారు. ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగింది’’ అని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా నమోదైన ఓటర్ల జాబితా నివేదికను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఎస్‌ఈసీ) ఆదేశిస్తూ విచారణ రేపటికి వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని