West Bengal: రేపే భవానీపూర్‌ ఉపఎన్నిక.. కేంద్ర బలగాలతో భారీ భద్రత

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న భవానీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు పోలింగ్‌ గురువారం జరగనుంది. అయితే గతంలో

Published : 29 Sep 2021 17:14 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న భవానీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు పోలింగ్‌ గురువారం జరగనుంది. అయితే గతంలో బెంగాల్‌లో ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈసారి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పోలింగ్ నేపథ్యంలో భవానీపూర్‌ నియోజకవర్గంలో 15 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. పోలింగ్‌ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ అమలు చేయనున్నట్లు తెలిపారు.

‘‘ప్రతి పోలింగ్‌ బూత్‌ లోపల కేంద్ర బలగాలకు చెందిన ముగ్గురు జవాన్లు, పోలింగ్ కేంద్రం బయట రాష్ట్ర పోలీసులు పహారా కాస్తారు. పోలింగ్‌ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడరాదు. రాళ్లు, బాణసంచా, ఇతర పేలుడు పదార్థాలు, ఆయుధాలను వెంట తీసుకెళ్లడంపై నిషేధం విధించాం. ఒక అదనపు పోలీస్‌ కమిషనర్‌, నలుగురు జాయింట్‌ కమిషనర్లు, 14 డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్‌ కమిషనర్లను భవానీపూర్‌కు పంపించాం. 13 క్విక్‌ రెస్పాన్స్‌ బృందాలు, స్టాటిక్‌ సర్విలెన్స్‌ టీం, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ విధుల్లో ఉంటారు’’ అని కోల్‌కతా పోలీసులు వెల్లడించారు.

భవానీపూర్‌ నుంచి గెలుపొందిన టీఎంసీ నేత సోభాందేవ్‌ ఛటోపాధ్యాయ రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి ఓటమి చవిచూసిన మమతా బెనర్జీ.. ఇప్పుడు ఈ ఉపఎన్నికలో భవానీపూర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. దీదీకి పోటీగా భాజపా నుంచి న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్‌ ఈ పోటీకి దూరంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని