Hemant Soren: బలపరీక్షలో నెగ్గిన హేమంత్‌ సర్కారు

ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ నేతృత్వంలోని జేఎంఎం-కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో నెగ్గింది.

Published : 09 Jul 2024 04:22 IST

మంత్రులుగా 11 మంది ప్రమాణం 

రాంచీ: ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ నేతృత్వంలోని జేఎంఎం-కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో నెగ్గింది. ఓటింగ్‌ సమయంలో సభలో 75 మంది ఎమ్మెల్యేలు ఉండగా 45 మంది విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఓటింగ్‌ మొదలవగానే భాజపా నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి సభ నుంచి వాకౌట్‌ చేసింది. భాజపాకు 24 మంది శాసన సభ్యులుండగా, దాని మిత్రపక్షం ఏజేఎస్‌యూకు ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు. బల పరీక్ష అనంతరం రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ సి.పి.రాధాకృష్ణన్‌ అధికార కూటమికి చెందిన 11 మంది సభ్యులతో మంత్రులుగా ప్రమాణం చేయించారు. వారిలో తాజా మాజీ సీఎం చంపయీ సోరెన్‌ కూడా ఉన్నారు. హేమంత్‌ సోదరుడు బసంత్‌ సోరెన్‌కు నూతన మంత్రుల జాబితాలో చోటు దక్కలేదు. భూకుంభకోణం కేసులో జనవరి 31న ఈడీ అరెస్టు చేయడానికి కొద్దిసేపటి ముందు హేమంత్‌ సోరెన్‌ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం చంపయీ సోరెన్‌ ఫిబ్రవరి 2న సీఎం పదవి చేపట్టారు. ఇటీవల హేమంత్‌ బెయిల్‌పై విడుదలైన తర్వాత.. చంపయీ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం హేమంత్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ద్వారా తన బలాన్ని నిరూపించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు