Bhujbal: ఫరూఖ్‌ జీ మీ వయస్సు 85 కాదు..58: శరద్‌ పవార్‌

ఎన్సీపీ అగ్రనేత ఛాగన్‌ బుజ్బల్‌ పుట్టిన రోజు వేడుకల్లో ఓ హాస్యసన్నివేశం చోటు చేసుకుంది. జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాకు  85 ఏళ్లు కాదని, 58 ఏళ్లేనని శరద్‌ పవార్‌ చలోక్తి విసిరారు.

Published : 14 Oct 2022 01:43 IST

ముంబయి: ఎన్సీపీ అగ్రనేత ఛగన్‌ భుజ్‌బల్‌ పుట్టిన రోజు వేడుకలను పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అధ్యక్షతన ముంబయిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాను వేదికపైకి ఆహ్వానిస్తూ.. 85 ఏళ్ల వయస్సులోనూ యువకుడిగా ఉన్నారంటూ ఎన్సీపీ సీనియర్‌ నేత ప్రఫుల్‌ పటేల్‌ వ్యాఖ్యానించారు. మధ్యలో కలగజేసుకున్న శరద్‌ పవార్‌ ‘ ఆయనకు 85 సంవత్సరాలు కాదు..58 ఏళ్లే’ అని సరదాగా స్పందించారు.

నేను భారతీయ ముస్లింని: ఫరూఖ్‌

భుజ్‌బల్‌ పుట్టిన రోజు వేడుకల్లో ఫరూఖ్‌ అబ్దుల్లా మాట్లాడుతూ.. దిల్లీలో ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముస్లిం సామాజిక వర్గంపై భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ‘‘ మేమ మీతోనే ఉంటున్నాం. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు యావత్‌ భారతదేశం ఒక్కటిగానే ఉండాలనుకుంటున్నాం. నేను ముస్లింనే. కానీ, భారతీయ ముస్లింని. అంతేకానీ, చైనా ముస్లింని కాదు’’ అని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ప్రత్యేకమే. కానీ, అందరం కలసిమెలసి ఉన్నప్పుడే దేశాన్ని అభివృద్ధి చేసుకోగలం. దీనినే స్నేహబంధం అంటారు. ఇతరుల్ని ద్వేషించమని ఏ మతమూ చెప్పదు. హిందుస్థాన్‌ మనందరిది’’ అని ఫరూఖ్ అన్నారు.భాజపా, భారత్‌ను విమర్శిస్తూ మాట్లాడిన వారిని శాశ్వతంగా బహిష్కరించాలంటూ ముస్లిం సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ కొందరు భాజపా నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

భుజ్‌బల్‌ సీఎం అయ్యుండేవారు: ఉద్ధవ్‌

శివసేనను వీడకపోయుంటే ఛగన్‌ బుజ్‌బల్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండేవారని శివసేన అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. భజ్‌బల్‌ 75వ పుట్టినరోజు వేడుకల్లో ఆయన మాట్లాడారు. భుజ్‌బల్‌ శివసేన పార్టీని వీడుతున్నారన్న వార్త తెలిసి అప్పట్లో తాను షాక్‌ గురయ్యానని చెప్పారు.‘‘ నేనే కాదు మా కుటుంబ సభ్యులంతా ఒక్కసారి షాక్‌కు గురయ్యారు.  రాజకీయాల్లో కోపాలు సహజమే. కానీ, చాలా రోజుల వరకు జీర్ణించుకోలేకపోయాం. అంతలా ఆయన మాతో కలిసిపోయారు’’ అని ఉద్ధవ్‌ చెప్పుకొచ్చారు. శివసేన ఫైర్‌ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న భుజ్‌బల్‌ 1990లో పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత ఆయన ఎన్సీపీలో చేరి అందులోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని