నేరేడ్‌మెట్‌ ఫలితానికి తొలగిన అడ్డంకి

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా నేరేడ్‌మెట్‌ డివిజన్‌ ఫలితం వెల్లడికి అడ్డంకి తొలగింది. ఇతర ముద్రలు ఉన్న ఓట్లు పరిగణనలోకి తీసుకునేందుకు హైకోర్టు

Published : 08 Dec 2020 02:05 IST

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా నేరేడ్‌మెట్‌ డివిజన్‌ ఫలితం వెల్లడికి అడ్డంకి తొలగింది. ఇతర ముద్రలు ఉన్న ఓట్లు పరిగణనలోకి తీసుకునేందుకు హైకోర్టు అనుమతించింది. ఇతర ముద్రలతో ఉన్న 544 ఓట్లను లెక్కించాలని ఆదేశించింది. గ్రేటర్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందురోజు అర్ధరాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్‌పై వివాదం నెలకొంది. స్వస్తిక్‌ గుర్తు కాకుండా ఇతర ముద్ర ఉన్నప్పటికీ ఆ ఓట్లనూ లెక్కించాలని ఎన్నికల సంఘం సర్క్యులర్‌లో పేర్కొంది. దీన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర భాజపా లీగల్‌సెల్‌ ఇన్‌ఛార్జ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆరోజు ప్రాథమికంగా విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. సర్క్యులర్‌ అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. ఒకవేళ ఇతర ముద్రతో కూడిన ఓట్లు మెజారిటీపై ప్రభావం చూపినట్లయితే అక్కడి ఫలితాన్ని వెల్లడించవద్దని హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నేరేడ్‌మెట్‌ ఫలితాన్ని ఎన్నికల అధికారులు వెల్లడించలేదు. 

తెరాస అభ్యర్థి 504 ఓట్ల మెజారిటీలో ఉన్నప్పటికీ ఇతర ముద్రతో ఉన్న ఓట్లు 544 ఉన్నాయి. ఇతర ముద్రతో ఉన్న ఓట్లు మెజారిటీ కంటే ఎక్కువగా ఉండటంతో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ డివిజన్‌ ఫలితాన్ని ప్రకటించలేదు. ఆ అంశంపై ఈరోజు హైకోర్టులో పూర్తిస్థాయిలో వాదనలు కొనసాగాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం తన పరిధి దాటి సర్క్యులర్‌ జారీ చేసిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదించారు. ఇతర ముద్రతో ఉన్న ఓట్లను పరిగణనలో తీసుకోవద్దని.. అది పూర్తిగా చట్టవిరుద్ధమని కోర్టుకు తెలిపారు. ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల నిర్వహణలో హైకోర్టు జోక్యం చేసుకోరాదని గతంలో సుప్రీంకోర్టు పేర్కొందని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తన పరిధికి లోబడే సర్క్యులర్‌ జారీ చేసిందని వివరణ ఇచ్చారు. ఓటరు తాను ఎవరికి ఓటు వేయాలనే స్పష్టత ఉన్నప్పుడు గుర్తు వివాదం కాదన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు భాజపా పిటిషన్‌ను కొట్టివేస్తూ ఇతర ముద్రతో ఉన్న 544 ఓట్లు లెక్కించాలని స్పష్టం చేసింది. దీనిపై అభ్యంతరాలుంటే ఎన్నికల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని పిటిషనర్‌కు ఉన్నత న్యాయస్థానం సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని