నరసరావుపేటలో ఉద్రిక్తత.. జల్లయ్య కుటుంబీకులను తోసేసి మృతదేహం తరలింపు

నరసరావుపేట ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రత్యర్థుల దాడిలో మృతిచెందిన తెదేపా కార్యకర్త జల్లయ్య మృతదేహం

Updated : 04 Jun 2022 13:02 IST

నరసరావుపేట: నరసరావుపేట ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రత్యర్థుల దాడిలో మృతిచెందిన తెదేపా కార్యకర్త జల్లయ్య మృతదేహం పోస్టుమార్టంపై కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. తమతో సంప్రదించకుండా పోస్టుమార్టం చేశారని బంధువుల ఆరోపించారు. తెదేపా నేతలు వచ్చే వరకు పోస్టుమార్టం చేయొద్దని చెప్పినా వినిపించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చురీ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు, బంధువుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

జల్లయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు వైద్యశాల నుంచి బొల్లాపల్లి మండలం రావులపురం తరలించారు. మృతదేహాన్ని తరలిస్తుండగా జల్లయ్య బంధువులు అడ్డుకున్నారు. దీంతో వారిని తోసివేసిపోలీసులు మృతదేహాన్ని వైద్యశాల నుంచి తీసుకెళ్లారు. పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో తెదేపా కార్యకర్త జల్లయ్యను ప్రత్యర్థులు నిన్న అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

తెదేపా నేతల గృహనిర్బంధం

జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొనకుండా తెదేపా నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జల్లయ్య మృతిపై పార్టీ తరఫున త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. జిల్లా నాయకులంతా అంత్యక్రియల్లో పాల్గొనాలని ఆదేశించడంతో ఆ పార్టీ నేతలు జంగమేశ్వరపాడు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పార్టీ తరఫున నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, బీద రవిచంద్ర, బుద్దా వెంకన్నతో పాటు జిల్లా ముఖ్యనేతలు జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో వీరంతా నరసరావుపేటకు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తెదేపా నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. 

విజయవాడలో బుద్దావెంకన్నను గృహనిర్బంధం చేయడంతో ఆయన తన ఇంటి వద్దే నిరసనకు దిగారు. గురజాలలో యరపతినేని శ్రీనివాస్‌, మాచర్ల తెదేపా ఇన్‌ఛార్జ్‌ జూలకంఠి బ్రహ్మరెడ్డిని హౌస్‌ అరెస్ట్‌చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని