Hyd News: రాజ్‌భవన్‌ ముట్టడి ఉద్రిక్తం.. పోలీసుల అదుపులో రేవంత్‌రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌ పిలుపుచ్చిన రాజ్‌భవన్‌ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలపై

Updated : 08 Dec 2022 16:37 IST

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘రాజ్‌భవన్‌ ముట్టడి’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలపై ఈడీ విచారణ చేపట్టడాన్ని నిరసిస్తూ రాజ్‌భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్‌ శ్రేణులు వివిధ మార్గాల్లో పెద్ద ఎత్తున రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఖైరతాబాద్‌ కూడలి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ద్విచక్రవాహనాన్ని ఆందోళన కారులు తగులబెట్టారు. ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. బస్సుపైకి ఎక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పోలీసుల అదుపులో ముఖ్యనేతలు..

మరోవైపు రాజ్‌భవన్‌ మార్గంలోకి వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని తోసుకొని కాంగ్రెస్‌ నేతలు దూసుకెళ్లారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి, గీతారెడ్డి, భట్టి విక్రమార్క, బోసురాజు, శ్రీనివాస్‌ కృష్ణన్‌, మహేశ్‌కుమార్‌ తదితర నాయకులు రాజ్‌భవన్‌ వైపు వెళ్లారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క, తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాంగ్రెస్‌ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట

రేవంత్‌రెడ్డిని స్టేషన్‌కు తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు, వందలాది మంది కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కొందరు కార్యకర్తలు సొమ్మసిల్లిపడిపోయారు. రాజ్‌భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు కార్యకర్తలు యత్నించడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్‌ నాయకుడు చామల కిరణ్‌రెడ్డి, కార్యకర్తలపై లాఠీఛార్జ్‌ చేశారు. అనంతరం రేవంత్‌రెడ్డిని బొల్లారం, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డిలను గోషామహల్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మహేష్ కుమార్ గౌడ్ తదితరులను పంజాగుట్ట పీఎస్‌లకు తరలించారు. 

పోలీస్ కాలర్‌ పట్టుకొని లాగిన రేణుకా చౌదరి

నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్‌ మహిళా నేతల అరెస్టుకు పోలీసులు యత్నించారు. రేణుకా చౌదరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆమెను చుట్టుముట్టారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అదుపులోకి తీసుకోవడానికి యత్నించగా ఆమె పోలీస్‌ కాలర్‌ పట్టుకొని లాగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్య కంఠం నొక్కేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అనంతరం రేణుకా చౌదరిని పోలీసులు బలవంతంగా వాహనంలో తరలించారు. 

ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ జామ్‌..
కాంగ్రెస్‌ నిరసనలతో ఖైరతాబాద్‌ కూడలి వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ మార్గంలో పోలీసులు వాహనాలను నిలిపేశారు. దీంతో ట్రాఫిక్‌లో అంబులెన్స్‌లు చిక్కుకున్నాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని