Himachal Pradesh: అనురాగ్ ఠాకూర్‌ ఇలాకాలో ఒక్క సీటూ గెలవని భాజపా..!

హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur) ఇలాకాలో భాజపాకు పరాభవం ఎదురైంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గంలో అన్ని స్థానాల్లో కమలం ఓడిపోయింది.

Published : 09 Dec 2022 14:21 IST

శిమ్లా: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Assembly election Results).. కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur)కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో భాజపా (BJP) ఓటమికి ఆయనే కారణమంటూ విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఇక, ఆయన సొంత నియోజకవర్గంలో భాజపా ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం గమనార్హం.

అనురాగ్‌ ఠాకూర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హమీర్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఐదు శాసనసభ స్థానాలున్నాయి. ఇందులో అన్ని చోట్లా కమలం పార్టీ ఓటమిపాలయ్యింది. ఇక్కడ నాలుగు స్థానాల్లో కాంగ్రెస్‌ (Congress) విజయం సాధించగా.. మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఠాకూర్‌ తండ్రి, హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌ గతంలో ప్రాతినిధ్యం వహించిన సుజన్‌పూర్‌లో భాజపా అభ్యర్థిపై కాంగ్రెస్‌ అభ్యర్థి 399 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సుజన్‌పూర్‌ నుంచి పలుసార్లు గెలిచిన ధుమాల్‌.. గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. దీంతో తాజా ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఈ నిర్ణయంపై అనురాగ్‌ ఠాకూర్‌ అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

ఇక, బొరాంజ్‌ శాసనసభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో భాజపా కేవలం 60 ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. బర్సార్‌, నదౌన్‌ స్థానాలు కూడా కాంగ్రెస్‌ దక్కించుకోగా.. హమీర్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇదిలా ఉండగా.. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP nadda) స్వస్థలం బిలాస్‌పూర్‌ పరిధిలోని మొత్తం మూడు అసెంబ్లీ స్థానాల్లో భాజపా స్వల్ప మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం.

హిమాచల్‌ ఎన్నికల్లో భాజపా ఓడిపోవడంతో అనురాగ్‌ ఠాకూర్‌పై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఠాకూర్‌ వర్గం, జేపీ నడ్డా వర్గం, మాజీ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ వర్గం మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో చాలా మంది రెబల్స్‌గా బరిలోకి దిగారు. వీరికి ఠాకూర్‌ పరోక్షంగా మద్దతు తెలపడంతో భాజపా అనుకూల ఓట్లు చీలిపోయాయంటూ విమర్శలు వస్తున్నాయి.

హిమాచల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 40 స్థానాల్లో విజయం సాధించగా.. భాజపా 25 చోట్ల గెలుపొందింది. మరో మూడు స్థానాల్లో స్వతంత్రులు గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని