Karnataka Results: ‘చామరాజనగర్‌’ సెంటిమెంట్‌.. ఆనవాయితీ రిపీట్‌

Karnataka Assembly election Results 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అఖండ విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలకు గానూ కాంగ్రెస్‌ 136 చోట్ల జయకేతనం ఎగురవేసింది. భాజపా 65 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమైంది.

Updated : 13 May 2023 20:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కన్నడనాట రాజకీయ ఆనవాయితీ పునరావృతమైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ (Congress) అఖండ విజయం సాధించింది. అంతేనా.. కర్ణాటక (Karnataka) ఎన్నికల్లో ఓ పార్టీ ఈ స్థాయిలో మెజార్టీ దక్కించుకోవడం దాదాపు 34 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం విశేషం. ఈ సందర్భంగా తాజా ఫలితాల్లో కొన్ని ప్రత్యేకతలివే.. (Karnataka Assembly election Results)

38 ఏళ్లుగా అదే సంప్రదాయం..

కర్ణాటకలో గత 38 ఏళ్లుగా ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాకపోవడం ఆనవాయితీగా వస్తోంది. 1983, 1985 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు జనతా పార్టీ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మళ్లీ సిట్టింగ్‌ ప్రభుత్వం ఎన్నికల్లో గెలవలేదు. 2013లో కాంగ్రెస్‌ గెలవగా.. 2018 ఎన్నికల్లో భాజపా అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. అయినప్పటికీ జేడీఎస్‌తో కలిసి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వరుసగా రెండోసారి నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే, ఈ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి మళ్లీ భాజపానే అధికారంలోకి వచ్చింది. తాజా ఎన్నికల్లో మరోసారి ఓటర్లు అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. హస్తం పార్టీకి పట్టంగట్టారు.

చామరాజనగర్‌ ‘శాపం’ నిజమేనా?

చామరాజనగర్‌ (chamarajanagar) జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రుల పాలిట శాపంగా మారిందనే అపవాదును దశాబ్దాలుగా మోస్తూనే ఉంది. చామరాజనగర్‌లో అడుగుపెట్టిన సీఎం.. ఆ పదవిని కోల్పోతారనే నమ్మకం కన్నడనాట పాతుకుపోయింది. తాజా ఫలితాలతో ఇది మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై రెండుసార్లు ఈ జిల్లాలో పర్యటించారు. ఫలితాల్లో భాజపా ఓటమిపాలవ్వడంతో బొమ్మై సీఎం పీఠం దిగకతప్పట్లేదు.

రికార్డు స్థాయిలో పోలింగ్‌ శాతం..

మే 10వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 73.19శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో ఈ స్థాయిలో ఓటింగ్‌ నమోదవ్వడం ఇదే తొలిసారి. 2013లో 71.83శాతం, 2018లో 73.36శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసొచ్చినట్లు తెలుస్తోంది.

  • పట్టణ ప్రాంతాల్లో భాజపా (BJP) ఓటు షేరు 46శాతంగా ఉండగా.. కాంగ్రెస్‌కు 43శాతం షేరు దక్కింది.
  • సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ (Congress)కు 39.9శాతం ఓట్లు పడగా.. భాజపాకు 36 శాతం ఓటు షేరు దక్కింది.
  • గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ఓటు షేరు 44శాతంగా ఉండగా.. భాజపాకు 36శాతం ఓట్లు దక్కాయి.
  • ఇక సెమీ రూరల్‌లో కాంగ్రెస్‌కు 44శాతం ఓట్లు పడగా.. భాజపాకు 29శాతం ఓటు షేరు దక్కింది.

ఆ ఇద్దరు మినహా..

కర్ణాటకలో ఇప్పటివరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగాయి. కానీ, మొత్తంగా ఇద్దరే ఇద్దరు నేతలు పూర్తిస్థాయిలో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. 1972లో దేవ్‌రాజ్‌ అర్స్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగా ఆయనే.. ఐదేళ్ల పాటు సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ 2013లో కాంగ్రెస్‌ హయాంలోనే సీనియర్‌ నేత సిద్ధరామయ్య ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. మిగతా అన్ని సందర్భాల్లో సీఎం కుర్చీని నేతలు/పార్టీలు పంచుకోవడం లేదా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం జరిగింది. ఈసారి కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధించింది. అయితే ఇప్పటికీ సీఎం ఎవరన్నది మాత్రం ఇంకా స్పష్టత లేదు.

34 ఏళ్ల తర్వాత అత్యధిక మెజార్టీ..

తాజాగా వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ 136 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీకి ఈ స్థాయిలో మెజార్టీ దక్కడం 34 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం విశేషం. 1989లో కాంగ్రెస్‌ ఏకంగా 178 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత 1994లో జనతాదళ్‌కు 115 స్థానాలు దక్కాయి. 1999లో కాంగ్రెస్‌ 132 సీట్లు గెలుచుకోగా.. 2004, 2008 ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడింది. 2013లో కాంగ్రెస్‌ 122 స్థానాలు దక్కించుకోగా.. 2018 ఎన్నికల్లో మళ్లీ హంగ్‌ వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని