Gujarat Elections: కాంగ్రెస్‌ను వెంటాడుతున్న ఆప్‌.. ‘గుజరాత్‌’ ఆశలకూ గండి!

Gujarat Elections 2022: గుజరాత్‌లో మరోసారి కాంగ్రెస్‌ (Congress) ఆశలకు గండి పడింది. స్వీయ తప్పిదాలు కొంత కారణం కాగా.. ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి పార్టీని దెబ్బ కొట్టింది.

Updated : 08 Dec 2022 19:54 IST

అది 2017 డిసెంబర్‌ 18. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Gujarat election 2022) వెలువడుతున్న రోజు. ప్రధాన పోటీ భాజపా- కాంగ్రెస్‌ (BJP- congress) మధ్యే. ఓ దశలో కాంగ్రెస్‌ (Congress) గెలుస్తుందన్నంత పనిచేసింది. భాజపాకు (BJP) ఆ స్థాయిలో చెమటలు పట్టించింది. అయినా కొద్ది సీట్ల తేడాతో అధికారం చేజార్చుకుంది. ఓ 10 సీట్లు అటూ ఇటూ అయితే కాంగ్రెస్‌ను అధికారం వరించేదే! ఐదేళ్లు గిర్రున తిరిగాయ్‌. ఈసారి పోటీ ఏకపక్షమే. భాజపా దూకుడు ముందు కాంగ్రెస్‌ పార్టీ వెలవెలబోయింది. అధికార పార్టీని అందుకోలేనంత దూరంలో నిలిచింది. ఎన్నడూలేని రీతిలో 50 శాతానికి పైగా ఓట్లు, 150కి పైగా సీట్లతో భాజపా గెలుపు దిశగా పయనిస్తుండగా.. గత 27 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌కు మరోసారి భంగపాటు ఎదురైంది. దీనికి కారణం కాంగ్రెస్‌ స్వీయ తప్పిదాలు కొన్నైతే.. ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) మరో కారణం!!

చీలింది కాంగ్రెస్‌ ఓటే..!

ఏ పార్టీ అయినా ఐదేళ్లు అధికారంలో ఉంటే.. మరుసటి ఎన్నికల్లో ఎంతోకొంత ప్రభుత్వ వ్యతిరేకత మూట గట్టుకోవడం సర్వసాధారణం. అదే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 27 ఏళ్లు అంటే మామూలు విషయం కాదు. అందుకే 2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్నడూ లేని స్థాయిలో 41 శాతం ఓట్లు వచ్చాయి. 77 సీట్లు వరించాయి. భాజపాకు 49 శాతం ఓట్లు 99  సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసారి ఎన్నికల ఫలితాల విషయానికొచ్చేసరికి భాజపాకు వచ్చిన ఓటింగ్‌ శాతం మరింత పెరిగింది. దాదాపు 53 శాతానికి చేరింది. కాంగ్రెస్‌ ఓటింగ్‌ శాతం అనూహ్యంగా 27 శాతానికి తగ్గింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ 12 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్‌ మూడింట రెండొంతులు.. ఆప్‌ ఒక వంతు పంచుకున్నట్లు స్పష్టమవుతోంది.

అప్పుడు దిల్లీ, పంజాబ్‌.. ఇప్పుడు గుజరాత్‌

ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా నిలుస్తామంటూ రాజకీయాలను ప్రారంభించిన ఆప్‌.. కాంగ్రెస్‌ను మొదటి నుంచీ దెబ్బకొడుతూ వస్తోంది. తొలుత దేశ రాజధాని దిల్లీలో కాంగ్రెస్‌ను అధికారం నుంచి దూరం చేసింది. ఆ తర్వాత పంజాబ్‌లో అడుగుపెట్టి.. తొలి ప్రయత్నంలోనే ప్రతిపక్ష స్థానానికి చేరింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి షాకిస్తూ.. అధికార స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పుడు గుజరాత్‌ ఎన్నికల్లోనూ అదే పనిచేసింది. ఏళ్లుగా ద్విముఖ పోరు ఉన్న గుజరాత్‌లో ప్రవేశించి త్రిముఖ పోరుగా మార్చిన ఆప్‌.. కాంగ్రెస్‌ను మరోసారి కోలుకోలేని దెబ్బకొట్టింది. ఒకవేళ ఆప్‌ పోటీలో లేకుంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోయినా.. బహుశా మరోసారి భాజపాకు గట్టి పోటీ ఇచ్చేదేమో! కానీ, కాంగ్రెస్‌ అధికార ఆకాంక్షలకు, ఆశలకు గండికొట్టడమే కాదు.. ఆ పార్టీ ఆత్మస్థైర్యాన్ని సైతం ఆప్‌ దెబ్బతీసింది.

కాంగ్రెస్‌ స్వీయ తప్పిదాలు..

గుజరాత్‌లో కాంగ్రెస్‌ పేలవ ప్రదర్శనకు స్వీయ తప్పిదాలూ కారణమే. ఓ దశలో ఆ పార్టీ అసలు గుజరాత్‌లో పోటీలో ఉందా? అనేంతగా ఆ పార్టీ వ్యవహరించింది. భాజపా తన మందీమార్బలాన్నంతా ప్రయోగిస్తే.. ఆప్‌ తనకున్న పరిమిత వనరుల్ని వినియోగించుకుని భాజపాకు గట్టి పోటీ తామే అన్నట్లుగా ప్రచారం చేసుకుంది. కాంగ్రెస్‌ మాత్రం ఆ స్థాయిలో దూకుడు ప్రదర్శించలేదన్నది ప్రచార సరళిని చూసేవారికి ఇట్టే అర్థమవుతుంది. చివరి నిమిషంలో రాహుల్‌, ఖర్గే పర్యటనలు పార్టీ శ్రేణుల్లో కొంతమేర ఉత్సాహాన్నిచ్చినా అదీ పరిమితమే. ‘భారత్‌ జోడో యాత్ర’కు కొద్ది రోజులు ముందు గుజరాత్‌ నేతలతో భేటీ అయిన రాహుల్‌.. ఆ తర్వాత రెండు దశల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో పర్యటించింది కేవలం ఒక్కటే రోజు! దీనికి తోడు గత ఎన్నికల సమయంలో మోదీని ఉద్దేశించి మణిశంకర్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను కొంతమేర దెబ్బకొట్టగా.. ‘100 తలల రావణుడు’ అంటూ మోదీపై ఖర్గే చేసిన వ్యాఖ్యలను భాజపా తనకు అనుకూలంగా మలచుకోగలిగింది.

పటేల్‌ లేని లోటు..

గుజరాత్‌ కాంగ్రెస్‌ కీలక నేత, ఆ పార్టీ వ్యూహకర్త అహ్మద్‌ పటేల్‌ మరణం ఆ పార్టీకి తీరని లోటనే చెప్పాలి. ఏనాడూ మీడియాలో పెద్దగా కనిపించని అహ్మద్‌పటేల్‌.. తెరవెనుక రాజకీయాలు నెరపడంలో దిట్ట. అంతే కాదు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి కూడా. మొదటి నుంచీ భాజపా పక్షాన నిలిచిన పటేళ్లను 2017 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌వైపు తిప్పుకోవడంలో ఆయన వ్యూహాలు గట్టిగానే పనిచేశాయి. పాటీదార్‌ ఉద్యమానికి నేతృత్వం వహించిన హార్దిక్‌ను పార్టీలో చేర్చుకోవడమూ ఇందులో భాగమే. అందుకే గత ఎన్నికల్లో ఆ పార్టీ ఆ స్థాయిలో ప్రదర్శన చేసింది. 2020లో కొవిడ్‌ సమయంలో తలెత్తిన అనారోగ్య పరిస్థితుల వల్ల ఆయన మరణించారు. దీంతో ఆ పార్టీ గుజరాత్‌లో పెద్ద దిక్కు కోల్పోయింది. హార్దిక్‌ పటేల్‌ భాజపా గూటికి చేరారు. మిగిలిన నేతలనూ అధిష్ఠానం లైట్‌ తీసుకుంది. దీంతో పార్టీ నేతల మధ్య సమన్వయ లేమి స్పష్టంగా ఎన్నికల్లో  కనిపించింది.

మొత్తంగా ఈ సారి ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ స్ట్రోక్‌ కొంతయితే..  స్వీయ తప్పిదాలు కాంగ్రెస్‌ను మరోసారి గుజరాత్‌లో అధికారానికి బహుదూరం చేశాయి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని