eatala rajender: ఈటలకు ‘ఉప’శమనం..!

ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌లో ఏటికి ఎదురొడ్డి విజయం సాధించారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో కాకలు తీరిన యోధులు నెలల తరబడి హుజూరాబాద్‌లోనే మకాం వేసి వ్యూహ రచన చేసినా.. ఆయన జోరును అడ్డుకోలేకపోయారు.

Published : 03 Nov 2021 01:37 IST

 ఏటికి ఎదురీదిన రాజేందర్‌ 

 హుజూరాబాద్‌లో కలిసొచ్చిన ఉప ఎన్నికల అనుభవం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌లో ఏటికి ఎదురొడ్డి విజయం సాధించారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో కాకలు తీరిన యోధులు నెలల తరబడి అక్కడే మకాం వేసి వ్యూహ రచన చేసినా, ఆయన జోరును అడ్డుకోలేకపోయారు. కౌంటింగ్‌ సమయంలో అధికార తెరాసకు కేవలం రెండు రౌండ్లలో ఆధిపత్యం లభించడం హుజూరాబాద్‌లో ఈటల హవాను తెలియజేస్తోంది. ముచ్చటగా మూడో ఉప ఎన్నికలోనూ ఈటల విజయం సాధించారు. 

నేల విడిచి సాముచేయలేదు!

ఏప్రిల్‌ చివరి వారంలో పార్టీలో ఉక్కపోత మొదలు కావడంతో ఈటల రాజేందర్‌కు పరిస్థితి అర్థమైంది. మే 2వ తేదీ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయడం ఆయన మనసును గాయపర్చింది. పార్టీలో భవిష్యత్తు అంధకారంగా మారడంతో ప్రజావేదికపైనే తీర్పును కోరేందుకు సిద్ధమై 12వ తేదీనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అప్పట్లో కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరిగింది. కానీ, పార్టీకి అవసరమైన వనరులు, ఎదురయ్యే ఇబ్బందులు, తెలంగాణలో కొత్త పార్టీ ఏమేరకు అవసరం  అన్న విషయాలు తెరాస నుంచి వచ్చిన ఈటలకు బాగా తెలుసు. అందుకే ఆలస్యం చేయకుండా భాజపాలో చేరిపోయారు. ఇది వ్యూహాత్మకంగా సత్ఫలితాన్నిచ్చింది.

కలిసొచ్చిన కాంగ్రెస్‌ ఓట్‌ బ్యాంక్‌..!

కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానం అప్పటికే భాజపా ఖాతాలో ఉండటంతో ఎంపీ బండి సంజయ్‌కు బలమైన కేడర్‌ ఉంది. ఆయన 90వేల మెజార్టీతో విజయం సాధించారు.  పైగా సంజయ్‌ స్వయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. అదే కాంగ్రెస్‌లో చేరితే అప్పటికే ఆ పార్టీలోని ఆశావహులతో విభేదాలు తలెత్తి  ఓటింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదాన్ని కూడా ఈటల పరిగణనలోకి తీసుకొన్నారు. దీనికి తగ్గట్లే కాంగ్రెస్‌ తరపున ఈ సారి కౌశిక్‌ రెడ్డి (2018 ఎన్నికల్లో 61,121 ఓట్లు) బరిలో లేరు. ఆయన టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొన్నారు.  కాంగ్రెస్‌ బల్మూరి వెంకట నర్సింగరావుకు అవకాశం ఇచ్చింది.  కాంగ్రెస్ అభిమానుల ఓట్లు ఈసారి ఈటలకు పడ్డట్టున్నాయి. అందుకే  ఇవాళ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ అభ్యర్థికి అత్యంత తక్కువ ఓట్లు వచ్చాయన్నది ఓ వర్గం విశ్లేషణ.   

ప్రజల్లో బలమైన పట్టు..

అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుసార్లు గెలిచిన ఈటలకు ప్రజల్లో మంచి పట్టుంది. ఇక్కడ ఉప ఎన్నికల పోల్‌ మేనేజ్‌మెంట్ నల్లేరుపై నడక. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమం కోసం రెండు సార్లు పదవికి రాజీనామా చేసి, ఉపఎన్నికలను ఎదుర్కొన్న అనుభవం తన సొంతం. అధికార పార్టీ ఏ స్థాయిలో శ్రేణులను మోహరిస్తాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు. అదీకాక, బీసీల్లో అత్యంత బలమైన నేతల్లో ఈటల ఒకరు కావడం కలిసొచ్చింది. ఈ నియోజకవర్గంలో బీసీల పరిధిలోకి వచ్చే పద్మశాలి (26వేలు ఓట్లు), గౌడ (24 వేలు ఓట్లు), ముదిరాజ్‌ (23 వేలు ఓట్లు), యాదవ (22 వేలు ఓట్లు) కులాలు బలంగా ఉన్నాయి. తెరాసలో ఆయన ప్రధాన ప్రత్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా బీసీనే అయినా.. ఈటల వంటి బలమైన గొంతుకను వదులు కోవడానికి ఓటర్లు ఇష్టపడలేదు. గెల్లు శ్రీనివాస్‌ స్వగ్రామం హిమ్మత్‌నగర్‌, అత్తగారి గ్రామం పెద్దపాపయ్య పల్లెలో కూడా ఈటలకే ఎక్కువ ఓట్లు పోల్‌కావడం గమనార్హం. 

సౌమ్యుడిగా పేరు.. సానుభూతి పవనాలు..!

ఈటలకు రాజకీయ వర్గాల్లో సౌమ్యుడిగా పేరుంది. 2009 అసెంబ్లీ ఎన్నికలయ్యాక.. అసెంబ్లీలో ఓ సందర్భంలో నాటి సీఎం వైఎస్సార్‌ విమర్శల దాడి చేసినా.. ఈటల హుందాగా వ్యవహరించిన విషయం చాలామందికి గుర్తుండిపోయింది. తాజాగా తెరాస నుంచి బయటకు వచ్చే సమయంలో కూడా ఈటల పరుష పదాలు వాడలేదు. తన తప్పు లేకుండానే పార్టీ నుంచి బయటకు వెళ్లగొడుతున్నారన్న భావనను నియోజక వర్గ ప్రజల్లోకి తీసుకురావడంలో విజయం సాధించారు. అసైన్డ్‌ భూములపై తొలి రోజుల్లో హడావుడి విచారణలు ప్రజల్లో అనుమానాలు పెంచాయి. ఇవన్నీ ప్రజల్లో ఈటలకు సానుభూతిని తెచ్చి పెట్టాయి. వాటిని ఆయన ఓట్ల రూపంలోకి మలచుకొన్నారు.

ప్రచారంలో అధికార తెరాస తరపున హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, బోయినపల్లి వినోద్‌ కుమార్‌, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, బాల్కసుమన్‌ వంటి హేమాహేమీలు పాల్గొన్నారు.  ఈటల ఒంటరిగా ఏటికి ఎదురీదుతున్నాడన్న సానుభూతి ప్రజల్లో వ్యక్తమైంది. ఎన్నికల్లో సానుభూతి పవనాలు గెలుపోటములను తారుమారుచేస్తాయన్న విషయం తెలిసిందే.

స్థానిక అంశాలకే ప్రాధాన్యం..

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు భారీగా పెరిగిపోతుండటం ఈటలకు ప్రతికూలంగా మారుతుందని తొలుత ప్రత్యర్థులు అంచనావేశారు. కానీ, ఈటల స్థానిక అంశాలనే ప్రచార ఆయుధాలుగా చేసుకొన్నారు. బీసీ కార్డును బలంగా వాడుకొన్నారు. ఉద్యమ సమయంలో, కొవిడ్‌ వేళ మీ అందరి వెంటే నేనున్నాను అన్న విషయాన్ని పదేపదే ప్రజలకు వివరించారు. ఇంటింటికీ వెళ్లారు. మీ ఆశీర్వాదం కావాలని అడిగారు. అవన్నీ పని చేశాయి. ఉత్కంఠగా సాగిన ఎన్నికలో తుది విజయం సాధించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని