Gujarat Election 2022: చక్‌ దే బీజేపీ...వరుస విజయాలు.. ఎలా సాధ్యం?

సాధారణంగా రెండుమూడు సార్లు వరుసగా అధికారం చేపడితేనే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతుంది. అలాంటిది భాజపా ఇలా అప్రతిహత విజయాలతో దూసుకెళ్లడానికి కారణం ఏంటి?మోదీ, అమిత్‌షా లాంటి కీలక నాయకులు రాష్ట్ర రాజకీయాలను విడిచి.. కేంద్రానికి వెళ్లినా..భాజపా హవా ఎందుకు తగ్గలేదు?

Updated : 08 Dec 2022 19:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గుజరాత్‌ (Gujarat)లో మరోసారి కమలం వికసించింది. వరుసగా ఏడోసారి భాజపా ప్రభంజనం సృష్టించింది. అధికారం కోసం కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీల యత్నాలను తుత్తునియలు చేసి, 156 స్థానాల్లో గెలుపొంది రికార్డు స్థాయి విజయం సాధించింది. గుజరాత్‌ చరిత్రలో ఇప్పటి వరకు కాంగ్రెస్‌ (Congress) పేరిట (1985లో 149 స్థానాల్లో విజయం) ఉన్న రికార్డును చెరిపేసింది. ఇలా వరుస విజయాలు సాధించడం ఏపార్టీకైనా అంత సులభమేం కాదు. రెండుమూడు సార్లు వరుసగా అధికారం చేపడితేనే సాధారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతుంది. అలాంటిది భాజపా ఇలా అప్రతిహత విజయాలతో దూసుకెళ్లడానికి కారణం ఏంటి?మోదీ (Modi), అమిత్‌షా (Amit shah) లాంటి కీలక నాయకులు రాష్ట్ర రాజకీయాలను విడిచి.. కేంద్రానికి వెళ్లినా..భాజపా హవా ఎందుకు తగ్గలేదు?

‘జై’ కొడుతున్న పట్టణ ఓటర్లు 

కేవలం భాజపా (BJP) వ్యతిరేక ఓట్లు చీలడం వల్లే కమలం పార్టీ ఇంతటి ఘన విజయం సాధించలేదు. భాజపా తన కోర్‌ ఓటర్లను నిలబెట్టుకుంది. గుజరాత్‌లో పట్టణ జనాభా అధికం. వారంతా కాషాయ పార్టీకే మద్దతు పలికారు. 1995లో తొలిసారి అధికారంలోకి వచ్చిన భాజపా ప్రధానంగా నగరాల అభివృద్ధివైపు దృష్టి సారించింది. మౌలిక సదుపాయాల కల్పన నుంచి..పెట్టుబడుల ఆకర్షించడం వరకు భాజపా పూర్తి స్థాయిలో విజయం సాధించింది. దీంతో పట్టణ ఓటర్లంతా భాజపాకే మొగ్గు చూపుతున్నారు.

హిందుత్వ మూలాలు

గుజరాత్‌లో అధిక సంఖ్యాకులు హిందువులు(Hindu). మిగతా సామాజిక వర్గాలు వారు ఉన్నప్పటికీ వారంతా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యారు. హిందుత్వ మూలాలున్న భాజపా వారి ఓట్లను ఆకర్షించడంలో ప్రతిసారీ పూర్తిగా సఫలమవుతోంది. మరోవైపు 1969లో మతకల్లోలాలతో గుజరాత్‌లో  పాక్‌ వ్యతిరేక సెంటిమెంట్‌ బలపడింది. ఈ క్రమంలో హిందువులకు భాజపా తన పూర్తి మద్దతు ఇచ్చింది. దీంతో అధిక సంఖ్యాకులుగా ఉన్న హిందువులు అప్పటి నుంచి భాజపాకే మద్దతు పలుకుతున్నారు.

సంస్థాగతంగా బలోపేతం

భాజపాకు ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) వెన్నెముక అని చెబుతుంటారు.  గుజరాత్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావం ఎక్కువ. దీంతో ఆ సంస్థ సభ్యుల నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తూ సంస్థాగతంగా పార్టీ మరింత బలం పుంజుకుంది. దీని సాయంతో భాజపా క్షేత్ర స్థాయిలో ప్రజల మధ్యకు వెళ్లగలిగింది. వాళ్ల సమస్యలను తెలుసుకుంటూ..వాటి పరిష్కారానికి కృషి చేసింది. దీంతో కేవలం పట్టణ ఓటర్లను మాత్రమే కాకుండా గ్రామీణస్థాయి ఓటర్లను కూడా ఆకర్షించడంలో భాజపా పూర్తి స్థాయిలో సఫలమైంది.దీంతో గ్రామీణ స్థాయిలో మంచి పట్టున్న కాంగ్రెస్‌ ఈసారి రూరల్‌ నియోజవర్గాల్లోనూ ప్రభావం చూపలేకపోయింది.

గోద్రా అల్లర్లు

2002, ఫిబ్రవరి 27 జరిగిన గోద్రా రైలు దహనం గుజరాత్‌ రాజకీయాల్లో ప్రకంపనలు లేపింది. గోద్రా ( Godra) రైల్వే స్టేషన్‌లో సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌ను దహనం చేయడంతో దాదాపు 59 మంది కరసేవకులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అయోధ్య కరసేవకు వెళ్లి తిరిగి వస్తున్న హిందూ యాత్రికులే ఎక్కువగా ఉన్నారు.  అప్పటి నుంచి హిందూ సామాజిక వర్గానికి చెందిన వారిలో అగ్రభాగం భాజపాకే మద్దతు తెలుపుతున్నారు.

పెట్టుబడుల వరద

కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గుజరాత్‌కు పెట్టుబడులు (Investments) వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్‌, పెట్రోకెమికల్‌, డిజిటల్‌ బిజినెట్‌ ,సాంకేతిక తదితర రంగాల్లో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. భాజపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేవలం రిలయన్స్‌ సంస్థే రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఇటీవల ముకేశ్‌ అంబానీ చెప్పడమే ఇందుకు ఉదాహరణ. ఇటీవల రూ.22వేల కోట్లతో సైన్యానికి ఎయిర్‌క్రాఫ్ట్‌లు తయారు చేసేందుకు టాటా, ఎయిర్‌బస్‌ గుజరాత్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇదే కాకుండా పలు ఎలక్ట్రానిక్‌ సంస్థలు కూడా గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. మరోవైపు కేంద్రం నుంచి కూడా రాష్ట్రానికి నిధుల వరద పారుతోంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండటంతో పెట్టుబడి దారులు తమకు అనుకూలంగా భావిస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్‌షాల స్వరాష్ట్రం కూడా కావడం పెట్టుబడులకు మరింత ఊతమిస్తోంది.

ఏ చిన్న అవకాశం ఉన్నా.. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే ప్రాజెక్టులను తీసుకురావడంలో భాజపా సఫలమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ హైవేను అహ్మదాబాద్‌, వడోదర, సూరత్‌ మీదుగా నిర్మిస్తున్నారు. రూ.98వేల కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే దిల్లీ నుంచి ముంబయికి కేవలం 12 గంటల్లో ప్రయాణించే వెసులుబాటు ఏర్పడుతుంది.

మోదీ బ్రాండ్‌

గుజరాత్‌లో మోదీ కీలకంగా మారిన తర్వాత.. అక్కడి రాజకీయాలు.. ‘మోదీకి ముందు.. ఆ తర్వాత’ అన్నంతలా మారిపోయాయి. అప్పటి వరకు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్‌ను ఓ ప్రణాళిక ప్రకారం బలహీన పరచడంలో మోదీ నూరుపాళ్లు సఫలమయ్యారు. తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా రాష్ట్రంపై శ్రద్ధ వీడలేదు. పాటిదార్ల రిజర్వేషన్లతోపాటు గ్రామీణ ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని గ్రహించిన భాజపా అధిష్ఠానం భూపేంద్ర పాటిల్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించి ప్రభుత్వంపై వ్యతిరేకతకు కళ్లెం వేశారు. మరోవైపు తాజా ఎన్నికల్లో తానే అభ్యర్థిని అన్నంతగా.. అంతా తానై మోదీ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల వేడి రాజుకున్న తర్వాత దాదాపు 20 రోజుల పాటు మోదీ రాష్ట్రంలోనే ఉండటమే ఇందుకు ఉదాహరణ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని