Pawan kalyan: పవన్‌.. రాజకీయాల్లో ఓ సైలెంట్‌ పవర్‌..!

‘పవన్‌ అంటే ఓ వ్యక్తికాదు.. తుపాను’అని ప్రధాని మోదీ అన్న మాటలు వాస్తవమే. చిన్న గాలితెమ్మెర వలే మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం ఏపీలో ఇప్పుడు ప్రభంజనమే సృష్టించింది. ఓ పెనుతుపానుగా మారి వైకాపా అరాచక ప్రభుత్వాన్ని కూల్చేసింది. రాజకీయ సునామీ అంటే ఏమిటో జగన్‌ సర్కారుకు తెలిసొచ్చేట్లు చేసింది.    

Updated : 12 Jun 2024 13:43 IST

‘‘కొన్నిసార్లు రావడం లేటు అవ్వొచ్చేమో గానీ, రావడం మాత్రం పక్కా’’ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పలికిన సంభాషణే ఇది. ఆయన రాజకీయాల్లో త్వరగానే వచ్చారు. కానీ, ‘అధ్యక్షా’ అని పిలవడానికి పదేళ్లు ప్రజా క్షేత్రంలో ఓ యుద్ధమే చేశారు. ఆయన శక్తి, సామర్థ్యం ఏంటో ప్రత్యర్థులకు తెలుసు. అందుకే పేదలకు నీడలా నిలబడదామనుకున్న చెట్టులాంటి పవన్‌ను పడగొట్టాలనుకున్నారు. వ్యక్తిగత విమర్శలతో అవమానించి హృదయాన్ని ముక్కలుగా కోయాలనుకున్నారు. దత్తపుత్రుడంటూ హేళన చేశారు.. వైకాపాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నుంచి మాజీ మంత్రుల వరకూ ప్రతిఒక్కరూ మేకుల్లాంటి మాటలతో మానసికంగా కుంగదీయాలనుకున్నారు. కానీ, పవన్‌ ఉక్కు సంకల్పం ముందు అవన్నీ ముక్కలయ్యాయి. జనమే ప్రభంజనమై ఆయన్ను గెలిపించారు. నేడు పవన్‌ రాష్ట్ర మంత్రిగా ప్రజల రుణం తీర్చుకొనేందుకు సిద్ధమయ్యారు. 

సినీ ప్రపంచం వీడి ప్రజాక్షేత్రంలోకి..

పవన్‌ కల్యాణ్‌ కోసం సూట్‌ కేసులతో డబ్బులు పట్టుకొని ఇంటిముందు నిలబడే నిర్మాతలు.. విలాసవంతమైన జీవితం.. ఫారిన్‌ ట్రిప్పులు.. ఇవేవీ ఆయనకు సంతృప్తినివ్వలేదు. ‘తనని ఆరాధించే, అభిమానించే వారి కోసం ఏదైనా చేయాలి’. అందుకు ప్రజాక్షేత్రమే తనకు సరైన వేదిక అని భావించారు. రాజకీయమంటేనే పులి మీద స్వారీ. ఒక్కసారి అడుగుపెట్టాక వెనుదిరిగి చూడకూడదు. నేరుగా ఆ రణక్షేత్రంలో దిగితే ఏ జరుగుతుందో కూడా తెలుసు. ఈ వాస్తవాలను దృష్టిలోపెట్టుకొనే నవ్యాంధ్రప్రదేశ్‌కు అనుభవజ్ఞుడైన పాలకుడు కావాలని గుర్తించాడు. దీంతో తెదేపా అధినేత చంద్రబాబుకు మద్దతు పలికాడు. ఎన్డీయేతో మైత్రీని కొనసాగించారు.

రెండు స్థానాల్లోనూ ఓడిపోయి..

ఐదేళ్లు గిర్రున తిరిగాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. 2014లో తెదేపాకు మద్దతు పలికిన పవన్‌కల్యాణ్‌.. 2019కి వచ్చేసరికి సైద్ధాంతిక విభేదాలతో  ఆ పార్టీకి దూరం జరిగారు. ఆ ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోరాటానికి దిగారు. తాను ఢీకొనేది రెండు (తెదేపా, వైకాపా) బలమైన శక్తులని తెలుసు. కానీ, ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఫలితం తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి. మరో నాయకుడైతే పార్టీని వదిలించుకునేందుకు చూసేవాడు. కానీ అక్కడున్నది పవన్‌. పార్టీ శ్రేణులు మనోధైర్యం కోల్పోకుండా మనో నిబ్బరం నింపాడు. పార్టీ నుంచి గెలిచిన ఏకైక అభ్యర్థి దూరమైనా అధైర్యపడలేదు. ఓటమిని దిగమింగి ఓర్పుగా ముందుకు కదిలారు.

పరిపక్వతతో ఆలోచించి.. ‘జన’పోరాటానికి ఊపిరి పోసి..

పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోతే ఏ రాజకీయ నాయకుడైనా కుంగిపోవడం ఖాయం. కానీ, జనసైనికులు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండేలా పవన్‌ కార్యనిర్దేశం చేశారు. ప్రజాభీష్టం మేరకు భారీ మెజార్టీతో గెలిచిన వైకాపాపై వేచి చూసే ధోరణితో రాజకీయ విజ్ఞత ప్రదర్శించారు. దాదాపు ఏడాది పాటు ప్రభుత్వంపై పెద్దగా విమర్శల జోలికి పోలేదు. నెమ్మదిగా అధికారం మత్తు తలకెక్కిన వైకాపా వ్యవస్థలను నిర్వీర్యం చేయడం మొదలుపెట్టిందని ఆయన గ్రహించారు. ప్రశ్నించిన జన సైనికులపై ప్రభుత్వం దాడులకు తెగబడింది. దీంతో జనసేనాని స్వయంగా రంగంలోకి దిగి వైకాపా ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం మొదలుపెట్టారు. నిత్యం పోరాటాలతో పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి. అందుకోసం తాను వద్దనుకున్న సినిమాలను మళ్లీ చేశారు. ఆయన చిత్రాలకు ఏపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు అన్నీఇన్నీ కావు. వాటిని తట్టుకున్నారు. జనసైనికుల్లో ఉన్న ఉత్సాహాన్ని ఓ ప్రజాపోరాటానికి ఇంధనంగా మార్చారు. ‘సీఎం.. సీఎం’ అని నినదించే అభిమానులంటే ‘ముందు నన్ను గెలిపించండి..’ అంటూ వినమ్రంగా అడగగలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్‌కల్యాణ్‌. 

సొంత డబ్బుతో సాయం..

వైకాపా ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ఓ కుంభకోణంగా మార్చిందనే విమర్శలు వెల్లెవెత్తాయి. దాదాపు 76 మంది కౌలు రైతులు ఉసురు తీసుకొన్నారు. ఇది పవన్‌ను కదిలించింది. 2022లో ‘రైతు భరోసా యాత్ర’ చేపట్టారు. ఆత్మహత్య చేసుకొన్న అన్నదాతల బిడ్డల బాధ్యతను స్వీకరిస్తానని ప్రకటించారు. సొంత డబ్బుతో రైతు కుటుంబాలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అన్నట్లే తన సొంత డబ్బు కోట్ల రూపాయలను ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలకు పంచారు. ఒక దశలో తన కుమారుడు అకీర కోసం దాచుకొన్న డబ్బును కూడా అన్నదాతలకు పంచినట్లు సన్నిహితులు పేర్కొన్నారు. మాటిస్తే.. ఎన్ని కష్టాలొచ్చినా వెనక్కి తగ్గని నేతగా నిలిచారు. 

స్నేహ ధర్మం ఎన్నడూ విస్మరించని నేతగా..

కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. ఆ స్నేహ ధర్మం పాటించిన వ్యక్తి పవన్‌కల్యాణ్‌. తెదేపా అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేసిన సమయంలో తాను ఉన్నానంటూ వచ్చి నిలబడ్డారు. తీవ్ర నిరాశలో ఉన్న తెదేపా శ్రేణుల్లో మనోస్థైర్యాన్ని పెంచారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు వెళ్లి మరీ ఆ పార్టీ మద్దతు పలికారు. చంద్రబాబు, తెదేపాను నిర్వీర్యం చేసేందుకు జగన్‌ చేసిన ముప్పేటదాడికి అడ్డు గోడలా నిలిచారు.

ఒక వ్యక్తిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం, దమ్ము లేనప్పుడు ప్రత్యర్థులు చేసే నీచమైన పని.. వ్యక్తిగత విమర్శలు చేయడం.  వైకాపాలో ఇలాంటివి చేసే గురివింద గింజలు చాలానే ఉన్నాయి. అవన్నీ వంతుల వారీగా పవన్‌పై దాడికి దిగాయి. రాజకీయాలు, పార్టీ సిద్ధాంతాలను వదిలేసి.. వ్యక్తిగత విషయాలను ఎత్తి చూపుతూ వైకాపా నాయకులు దిగజారుడు వైఖరి అవలంభించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే బహిరంగ సభల్లో వ్యక్తిగత దూషణలకు తెరతీయడం దీనికి నిదర్శనం. ఈ దశలో కూడా పవన్‌ చాలా సహనంగా ఉన్నారు.

ఓటును ఒడిసిపట్టిన జనసేనాని..

ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కలవడంలో పవన్‌కల్యాణ్‌ది కీలక పాత్ర. మొదటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాతో సత్సంబంధాలను కొనసాగించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని గ్రహించారు. కూటమి అవసరాన్ని అనేక వేదికలపై చెబుతూ పార్టీ శ్రేణులను మానసికంగా సన్నద్ధం చేశారు. వైకాపా అరాచక పాలన అంతం చేయడం రాష్ట్ర తక్షణావసరం అన్న భావనతో తానే ఒక అడుగు ముందుకువేశారు. ఇందులోభాగంగానే తెదేపా, భాజపాల మధ్య సయోధ్య కుదిర్చి ఏపీలో ఎన్డీయే కూటమి ఏర్పడటానికి సూత్రధారి, పాత్రధారి అయ్యారు. 

ఎక్కడ నెగ్గాలో కాదు.. తగ్గాలో తెలుసు

2024 ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌కు ఎదురైన అతిపెద్ద సవాల్‌ సీట్ల సర్దుబాటు. తెదేపాతో పొత్తు ప్రకటించగానే ఏపీ రాజకీయాల్లో జరిగిన అతిపెద్ద చర్చ జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు? అని. తెదేపాకు ఎదురైన గడ్డు పరిస్థితులను అవకాశంగా మలుచుకోలేదు సరికదా.. ఆ పార్టీకి మద్దతు ప్రకటించి అండగా నిలిచారు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో పవన్‌కల్యాణ్‌కు బాగా తెలుసు. తన బలాన్ని, బలగాన్ని సరిగ్గా అంచనా వేసుకొన్నారు. తక్కువ సీట్లు తీసుకుని అన్ని గెలవాలన్న అజెండాతో ముందుకువచ్చారు. చివర్లో భాజపా కోసం కొన్ని సీట్లు వదులుకొన్నారు. ‘ఎన్ని స్థానాల్లో పోటీ చేశామన్నది ముఖ్యం కాదు. స్ట్రైక్‌రేట్‌ ముఖ్యం’ అంటూ శ్రేణులకు నచ్చజెప్పారు. అనుకొన్నట్లే 100 శాతం స్ట్రైక్‌ రేట్‌తో రికార్డులు బద్దలు కొట్టారు. ఫలితంగా ‘కొణిదల పవన్‌ కల్యాణ్‌ అనే నేను’ అంటూ నేడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఎదుట సగర్వంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని