
Ts News: హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వంసిద్ధం
హుజూరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. గతంలో ఎన్నడూ లేనంత మంది అభ్యర్థులు ఈసారి బరిలో ఉన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భారీ పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ ప్రక్రియ సాగనుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు, 5 మండలాలు, 106 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా శనివారం ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా... చివరి అరగంటలో కొవిడ్ బాధితులకు అవకాశం కల్పించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో 306 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన అధికారులు గతంలో జరిగిన ఘటనల ఆధారంగా 107 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక బలగాలను మోహరించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలు చేస్తున్న అధికారులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో మొత్తం 2,37,036 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,17,933 మంది కాగా, మహిళలు 1,19,102 మంది ఉన్నారు. ఉప ఎన్నిక కోసం మొత్తం 421 కంట్రోల్ యూనిట్లు, 891 బ్యాలెట్ యూనిట్లు, 515 వీవీ ప్యాట్లను వినియోగిస్తున్నారు. మొత్తం 1,715 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. విద్యుత్‌తో పాటు సోలార్ దీపాలను ఏర్పాటు చేసి పోలింగ్‌కు ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. 306 పోలింగ్ స్టేషన్లలో లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్టు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. నవంబర్ 2న కరీంనగర్‌లోని ఎస్ ఆర్ఆర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.