హైదరాబాద్‌ సంస్థానం జనాభా ఎంతంటే?

ఐటీ పరిశ్రమలు, మెట్రో సేవలు, ఆకాశ హర్మ్యాలు, ఉద్యానవనాలు, పార్కులు, చారిత్రక కట్టడాలు, ప్రత్యేక వంటల రుచులు

Published : 22 Nov 2020 12:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఐటీ పరిశ్రమలు, మెట్రో సేవలు, ఆకాశ హర్మ్యాలు, ఉద్యానవనాలు, పార్కులు, చారిత్రక కట్టడాలు, ప్రత్యేక వంటల రుచులు తదితరాలతో కూడిన భాగ్యనగరంగానే మనందరికీ హైదరాబాద్‌ గురించి తెలుసు. అయితే ఒకప్పుడు ఈ నగరం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆనాటి రాజ్య వ్యవస్థ.. ఏడో నిజాం నవాబ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ సంస్కరణలు ఈనాటి పాలనకు దర్పణం పడతాయి. ఆయన హైదరాబాద్‌ రాజ్య అధికార పగ్గాలు చేపడుతున్న సమయంలో దేశ విదేశాల్లో మార్పులకు జీజం పడుతున్న కాలమని చరిత్రకారుల మాట. ఉస్మాన్‌ అలీఖాన్‌ తండ్రి మహబూబ్‌ అలీఖాన్‌ తన కుమారుడికి 82,698 చదరపు మైళ్లు విస్తరించిన రాజ్యాన్ని అప్పగించారు. ఇది ఇంగ్లాండు, స్కాట్లాండ్‌ కంటే విస్తీర్ణంలో పెద్దది. ఇటలీ, ఫ్రాన్స్‌ దేశాల అంత విస్తీర్ణం కలదని చరిత్రకారులు చెప్పుకొచ్చారు. ఇంకా చెప్పాలంటే జమ్మూకశ్మీర్‌ మినహా ఇతర సంస్థానాల కంటే పెద్దది. కోరమాండల్‌, కోయంబత్తూర్‌ మినహా మద్రాసు ప్రెసిడెన్సీతో సమానమని, ఐర్లాండు కంటే రెండున్నర రెట్లు పెద్దదని చరిత్రకారుడు, భాషా సాహితీవేత్త డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ తన ‘నిజాం నవాబులు- ఆసఫ్‌జాహీల ఉత్థాన పతనాల కథ’ అనే పుస్తకంలో ప్రస్తావించారు. ఇది ఎంతో చూడచక్కని ప్రాంతమని వివరించారు. 

మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌

ఈ నిజాం కాలంలో.. 
అప్పట్లో హైదరాబాద్‌ సంస్థానానికి  రైల్వే లైను ద్వారా ఏటా రూ.30 లక్షల ఆదాయం వచ్చేది. దీంతో పాటు నిజాం రాజ్యంలో విస్తారంగా బొగ్గుగనులు ఉండేవి. వీటిని 1876లో జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు చెందిన డాక్టర్‌ విల్‌ఫ్రిడ్‌ కింగ్‌ కనుగొన్నారు. గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదులు నిజాం రాజ్యం గుండా ప్రవహించేవి. జనాభాలో సగ భాగం వ్యవసాయంపైనే ఆధారపడేవారు. నగరం, పట్టణం, గ్రామం అని తేడా లేకుండా అన్నిస్థాయుల్లో అప్పట్లో అమలులో ఉన్న బెగార్‌(వెట్టిచాకిరి)ని నిషేధిస్తూ నిజాం ఓ చట్టాన్ని చేశారు. ఉస్మాన్‌ అలీఖాన్‌ పదవి చేపట్టిన కొద్దికాలంలోనే కానూన్‌ ఇన్సిదాదెముఖన్నిసాస్‌ పేరిట ఓ ఆర్డినెన్సు జారీ చేశారు. తన రాజ్యంలో దేవదాసీ వ్యవస్థను అలీఖాన్‌ నిషేధించారు. దీంతోపాటు కోడిపందేలు, ఎడ్లపోటీలపై కఠినంగా వ్యవహరించారు. కేసుల విచారణ, వాదనల సందర్భంగా న్యాయవాదులు, ఉన్నతాధికారులు సక్రమంగా తలపాగా, దస్తార్‌ ధరించాలని ఆదేశించారు. 

 దాదాపు 22,500 గ్రామాలు, 80 పట్టణాలతో హైదరాబాద్‌ రాష్ర్టం అలరారేది. 18,000 చదరపు మైళ్ల అటవీ విస్తీర్ణం ఉందేది. అందులో వెలకట్టలేని కలపకు పెట్టింది పేరు. పొరుగున ఉన్న బొంబాయి రాష్ర్టంలోని పుణె, షోలాపూర్‌లను కలిపే రోడ్డు మార్గం నిర్మించారు. హైదరాబాద్‌ సంస్థానంలో 8,109 చదరపు మైళ్ల ప్రైవేటు ఎస్టేటు ఉండేది. దీన్ని సర్సెఖాన్‌ అనేవారు. దీని ద్వారా ఏడాదికి రూ.23 లక్షల ఆదాయం సమకూరేది. రాజ్య ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలతో ముడిపడి ఉండేది. ఈ గ్రామీణ ప్రాంతాలతో శ్రామికుల శ్రమశక్తిలో 11,000 మంది జాగీర్దారులు, వ్యవస్థీకృత దళారీలు భాగం పంచుకునే వారు. ఈ దళారీల ఆధీనంలో భూమిలో 31 శాతం ఉండేది. గ్రామీణ వ్యవస్థను తొమ్మిది అంచెల సామాజిక వ్యవస్థ శాసించేది. భూస్వామ్య వ్యవస్థ లక్షణాలన్నీ కొనసాగాయి. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని