UP Polls: నేను భయపడను..యూపీలో భాజపా ఓడిపోతోంది: మమత

యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వస్తుండగా భాజపా కార్యకర్తలు తనను అడ్డుకున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం ....

Published : 04 Mar 2022 01:23 IST

వారణాసి: యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వస్తుండగా భాజపా కార్యకర్తలు తనను అడ్డుకున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. విమానాశ్రయం నుంచి ఘాట్‌ వైపు వస్తుంటే.. మధ్యలో కొందరు భాజపా కార్యకర్తలు తన కారును అడ్డుకొకొని.. వాహనంపై దాడి చేసి తనను నెట్టివేశారని తెలిపారు. అంతేకాకుండా తనను వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు కూడా చేశారని దీదీ చెప్పారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసిలో సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా దీదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను అడ్డుకొనేందుకు భాజపా కార్యకర్తలు వచ్చినప్పుడే.. వారు అధికారం కోల్పోబోతున్నారని తనకు అర్థమైందన్నారు. భాజపాకు ఓటమి ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. తాను రాజకీయ సమావేశానికి యూపీకి వస్తే.. భాజపా ఎందుకు అంత బాధపడుతుందో ఆశ్చర్యంగా ఉందన్నారు. ‘‘నేను భయపడను.. నేనే పోరాటయోధురాల్ని. చాలా కాలం పోరాటం చేశాను. గతంలో బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వ హయాంలో నాపై అనేకసార్లు కర్రలతో దాడి జరిగింది. పలుమార్లు కాల్పులు కూడా జరిగాయి. కానీ ఎప్పుడూ నేను తలవంచలేదు. 

భారతీయుల్ని ముందే తరలించలేదెందుకు?
రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌ అట్టుడుకుతున్న వేళ అక్కడ భారతీయులు చిక్కుకుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం యూపీ ఎన్నికల సభల్లో బిజీగా ఉన్నారంటూ విమర్శించారు. ఉక్రెయిన్‌లో భీకర యుద్ధం కొనసాగుతుంటే భారతీయుల్ని కేంద్ర ప్రభుత్వం మధ్యలోనే వదిలేసిందంటూ దీదీ ఆరోపించారు. ‘‘ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగుతుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ మీటింగుల్లో ఉన్నారు. ఏది ముఖ్యం? అక్కడ చిక్కుకున్న విద్యార్థుల్ని వెనక్కి తీసుకురావడం ముఖ్యం కాదా?’’ అని ప్రశ్నించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని