Kiren Rijiju: ‘సూలే గారూ.. నేనింకా బ్రతికే ఉన్నా’.. ట్విటర్‌లో కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు

నేనింకా బ్రతికే ఉన్నానని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఎన్సీపీ నేత సుప్రియా సూలేకు తెలిపారు. తానింకా విధులు నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు.......

Updated : 05 Apr 2022 06:02 IST

దిల్లీ: ‘నేనింకా బతికే ఉన్నా’ అంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఎన్సీపీ నేత సుప్రియా సూలేతో వ్యాఖ్యానించారు. తానింకా విధులు నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు. అయితే ఇదేదో వారిద్దరి మధ్య వాడీవేడీ వాగ్వాదం జరిగినప్పుడు అన్న మాటలు కాదు. లోక్‌సభలో మహిళా ఎంపీ తడబడటంతో రిజిజు ఇలా చమత్కరించారు. అసలేం జరిగిందంటే.. సుప్రియా సూలే గతవారం లోక్‌సభలో మాట్లాడుతూ.. గతంలో క్రీడల మంత్రిగా ఉన్న రిజిజు క్రీడాభివృద్ధికి ఎనలేని సేవలు చేశారని పేర్కొంటూ కాస్త తడబడ్డారు. ‘క్రీడల మంత్రిగా కిరణ్‌ రిజిజు విశేష సేవలు చేశారు. కానీ ఆయన ఇప్పుడు లేరు’(he is no more) అని పేర్కొన్నారు. నో మోర్‌ అంటే వ్యక్తి చనిపోయారనే అర్థం వస్తుండటంతో అక్కడే ఉన్న ఇతర నేతలు ఆమెను అప్రమత్తం చేశారు. దీంతో సుప్రియా సూలే తన పొరపాటును సరిచేసుకున్నారు.

కాగా.. ఇందుకు సంబంధించిన వీడియోను కిరణ్‌ రిజిజు సోమవారం ట్విటర్‌లో షేర్‌ చేశారు. తానింకా బ్రతికే ఉన్నానని చమత్కరించారు. ‘సూలే గారూ నేనింకా బ్రతికే ఉన్నా, నా విధులు నిర్వహిస్తున్నా. ఏదేమైనప్పటికీ మీ ఆహ్లాదకరమైన మాటలకు ధన్యవాదాలు. ఎందుకంటే క్రీడలను రాజకీలకు అతీతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది’ అని ట్వీట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని