Sharad Pawar: అధ్యక్ష పదవికి శరద్‌ పవార్‌ రాజీనామా.. ఎన్సీపీ పగ్గాలు వదిలేసిన అగ్రనేత

ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ వల్ల మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో ఎన్‌సీపీ పార్టీ అధినేత శరద్‌ పవార్‌(Sharad Pawar) నుంచి కీలక ప్రకటన వెలువడింది.  

Updated : 02 May 2023 14:46 IST

ముంబయి: ఎన్‌సీపీ (NCP) వ్యవస్థాపకుడు, రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ (Sharad Pawar) కీలక ప్రకటన చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ముంబయిలో జరిగిన తన ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పవార్‌ ఈ ప్రకటన చేశారు. ఈ నిర్ణయాన్ని ఎన్‌సీపీ కార్యకర్తలు తీవ్రంగా నిరసించారు. మరికొంత మంది అయితే కన్నీరు పెట్టుకున్నారు. తన సమీప బంధువు అజిత్ పవార్‌.. ఎన్‌సీపీని వీడి భాజపాలో చేరతారనే ఊహాగానాల మధ్య పవార్‌ ఈ నిర్ణయాన్ని వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, తదుపరి పార్టీ బాస్‌ ఎవరనే దానిపై స్పష్టత లేదు. ఆ వివరాలు తెలియాల్సి ఉంది.

మహారాష్ట్రలో మునుపటి సంకీర్ణ ప్రభుత్వంలో భిన్న సిద్దాంతాలు కలిగిన పార్టీలను ఒక దగ్గరకు చేర్చిన ఘనత పవార్‌దే (Sharad Pawar). ఆయన చొరవ వల్లే కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. అయితే, శివసేనలో చీలిక రావడంతో ఆ కూటమి ప్రభుత్వం కూలిపోయింది. అయినప్పటికీ ఆ పార్టీలు మాత్రం ఇప్పటికీ ఒక్కటిగానే ఉన్నాయి.

ఇటీవల అజిత్ పవార్‌ భాజపాకు దగ్గరవుతున్నారనే వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి కమలం పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్నది ఆ వార్తల సారాంశం. వీటిని అజిత్, శరద్‌ పవార్‌ తోసిపుచ్చారు. అయితే ఆయన కుమార్తె సుప్రియా సూలే మాత్రం వచ్చే 15 రోజుల్లో దేశ రాజకీయాల్లో రెండు భారీ కుదుపులు సంభవిస్తాయని, ఒకటి దిల్లీలో, ఇంకోటి మహారాష్ట్రలో అని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన గురించి ముందుగా తెలిసే సుప్రియా ఆ మాట అనుంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పవార్ ప్రస్థానమిదీ..

పవార్‌ 1940లో మహారాష్ట్రలోని బారామతి ప్రాంతంలో జన్మించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపారు. కాంగ్రెస్‌ పార్టీతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. హస్తం పార్టీ తరఫున నాలుగు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ పూర్తిస్థాయిలో ఎప్పుడూ పదవిలో లేరు. పలు పర్యాయాలు పార్లమెంట్‌ ఉభయసభలకు ప్రాతినిధ్యం వహించారు. తదనంతరకాలంలో విభేదాలతో 1999లో కాంగ్రెస్‌ను వీడి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2005 నుంచి 2008 బీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. 2010 నుంచి 2012 ఐసీసీ ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌ హయాంలో కేంద్రమంత్రిగా వ్యవహరించారు. రక్షణశాఖ, వ్యవసాయ శాఖ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల బాధ్యతలు చూసుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పవార్‌.. ఎగువ సభలో ఎన్సీపీ సభాపక్ష నేతగా కొనసాగుతున్నారు. రాజకీయ రంగంలో ప్రజలకు ఆయన చేసిన సేవలకు గానూ.. కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మ విభూషణ్‌తో సత్కరించింది.

ఆత్మకథలో 2019 ఘటన..

తాజాగా విడుదల చేసిన ఆత్మకథలో పవార్ 2019 నాటి ఘటనను కూడా ప్రస్తావించారు. 2019 మహా అసెంబ్లీ ఎన్నికల తర్వాత శరద్‌పవార్ ఎంవీఏ కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నాలుచేస్తుండగా.. అజిత్ పవార్ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. భాజపా అగ్రనేత దేవేంద్ర ఫడణవీస్‌తో కలిసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించారు. ‘23నవంబర్‌ 2019  తెల్లవారుజామున నాకొక కాల్ వచ్చింది. అజిత్, మరికొంతమంది ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌ వద్ద ఉన్నారని, ఫడణవీస్‌తో కలిసి ప్రమాణస్వీకారం చేశారని దాని సారాంశం. ఆ ఘటన నన్ను షాక్‌కు గురిచేసింది. నా మద్దతుతో ఇది జరిగిందని కొందరు అన్నారు. కానీ, ఎంవీఏ కూటమి ప్రయత్నాలు విఫలం చేసేందుకు భాజపా చేసిన కుట్ర అది. వెంటనే నేను ఉద్ధవ్‌ఠాక్రేకు ఫోన్ చేసిన దానికి నా మద్దతు లేదని చెప్పాను. వారంతా రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు నా పేరు వాడారు’ అని వెల్లడించారు. ఆ తర్వాత ఆయన కుమార్తె సుప్రియా సూలే చేసిన ప్రయత్నాలతో అజిత్ సొంత గూటికి వచ్చారు. అనంతరం ఎంవీఏ కూటమి మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని