Nitish kumar: నా డ్రీమ్‌ అదొక్కటే.. నీతీశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో విపక్షాలన్నీ ఏకమై ముందుకు సాగితే చూడాలన్నదే తన డ్రీమ్‌ అన్నారు.

Published : 20 Jan 2023 01:44 IST

పట్నా: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో బుధవారం భారాస(BRS) ఆవిర్భావ బహిరంగ సభ జరిగిన మరుసటి రోజు బిహార్‌ సీఎం(Bihar CM) నీతీశ్‌ కుమార్‌(Nitish Kumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కలిసి ముందుకెళ్తే చూడాలని ఉందన్నారు. అదొక్కటే తన డ్రీమ్‌(Dream) అన్నారు. గురువారం పట్నాలో విలేకర్లతో మాట్లాడిన నీతీశ్‌.. తనకేమీ అవసరం లేదని.. కాకపోతే ప్రతిపక్ష నేతలంతా ఏకమై ముందుకు సాగితే చూడాలన్న ఒకే ఒక్క డ్రీమ్‌ ఉందన్నారు. తద్వారా దేశానికి మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. 

ఖమ్మంలో బుధవారం జరిగిన భారాస ఆవిర్భావ బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌(KCR) ఆహ్వానం మేరకు దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal), పంజాబ్‌ సీఎం భగవంత్‌  మాన్‌(Bhagwant Mann), కేరళ సీఎం పినరయి విజయన్‌(Pinarayi Vijayan)తో పాటు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా(D Raja), సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌(Akhilesh Yadav) తదితరులు హాజరైన విషయం తెలిసిందే. అయితే, ఈ వేదికపై నుంచి నేతలంతా భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఈ నేపథ్యంలో విపక్షాల ఐక్యతపై నీతీశ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, భారాస బహిరంగ సభకు ఎందుకు గైర్హాజరయ్యారని నీతీశ్‌ను విలేకర్లు ప్రశ్నించగా.. కేసీఆర్‌ నిర్వహించిన ఈ బహిరంగ సభ గురించి తనకు సమాచారం లేదన్నారు. తాను వేరే పనుల్లో బిజీగా ఉన్నట్టు వెల్లడించారు. ఒకవేళ సభకు కేసీఆర్‌ ఆహ్వానించినా హాజరు కాలేకపోయేవాణ్నని నీతీశ్‌ తెలిపారు. రాష్ట్రంలో సామధాన్‌ యాత్ర, వచ్చే నెలలో బడ్జెట్‌ సమావేశాలు తదితర కార్యక్రమాల్లో తీరికలేకుండా ఉన్నందున భారాస సభకు వెళ్లే వీలు ఉండేది కాదన్నారు. కేసీఆర్‌ సారథ్యంలోని పార్టీ చేపట్టిన బహిరంగ సభకు ఆహ్వానం అందిన నేతలు కచ్చితంగా వెళ్లి ఉంటారని నీతీశ్‌ వ్యాఖ్యానించారు.

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెసేతర విపక్షాల సభగా నిలిచిన భారాస ఆవిర్భావ బహిరంగ సభలో పాల్గొన్న నేతలంతా ప్రధాని మోదీ, భాజపాను టార్గెట్‌ చేసుకొనేందుకు ఉమ్మడి వేదికగా దీన్ని మలచుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెరాసను భారాసగా మార్చి జాతీయ స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించిన తర్వాత నిర్వహించిన తొలి బహిరంగ సభ ఇదే. ఈ వేదిక నుంచి నేతలంతా  దేశానికి కొత్త సర్కారు కావాలని, దీనికి ఖమ్మం సభ నాంది పలికినట్లేనని తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, గవర్నర్లను అడ్డుపెట్టుకొని విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను వేధించడం, ఎమ్మెల్యేల కొనుగోళ్ల ద్వారా ప్రభుత్వాలను కూలగొట్టడం తప్ప రైతులు, కార్మికులు, యువత గురించి ఆలోచించడం మానేసిందంటూ విరుచుకుపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని