Uddhav Thackeray: భాజపాతో పొత్తు పెట్టుకుని 25ఏళ్లు వృథా చేశాం.. ఠాక్రే వ్యాఖ్యలు

భాజపాపై ఒంటరిగా పోటీ చేసి గెలవాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా విసిరిన సవాలును స్వీకరిస్తున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌

Published : 24 Jan 2022 13:38 IST

ముంబయి: భాజపాపై ఒంటరిగా పోటీ చేసి గెలవాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా విసిరిన సవాలును స్వీకరిస్తున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమలం పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భాజపాతో పొత్తు పెట్టుకుని శివసేన పార్టీ పాతికేళ్లు సమయం వృథా చేసుకుందన్నారు. ఆ పార్టీ మాదిరిగా తాము ఎన్నడూ అధికారం కోసం హిందుత్వను వాడుకోలేదన్నారు. 

శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే 96వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఉద్ధవ్‌ ఠాక్రే వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘భాజపా రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో చాలా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అందులో శివసేన కూడా ఉంది. అధికారంలోకి వచ్చి హిందుత్వ అజెండాను అమలు చేయాలన్న ఉద్దేశంతోనే మేం గతంలో భాజపాతో చేతులు కలిపాం. అంతేగానీ, అధికారం కోసం హిందుత్వను వాడుకోలేదు. కానీ, భాజపా మాత్రం అధికారం కోసం పాకులాడుతూ హిందుత్వ అవకాశావాదిగా మారింది. అందుకే ఆ పార్టీ నుంచి విడిపోయాం. భాజపాతో పొత్తు పెట్టుకుని శివసేన 25ఏళ్ల సమయం వృథా చేసుకుందని నేను ఇప్పటికీ నమ్ముతున్నా’’ అని ఉద్ధవ్‌ ఠాక్రే చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఒంటరిగా పోటీ చేసి గెలవాలంటూ అమిత్ షా చేసిన సవాలను తాను స్వీకరిస్తున్నట్లు ఠాక్రే వెల్లడించారు. శివసేనను మహారాష్ట్ర వెలుపలా విస్తరిస్తామని చెప్పారు. 

శివసేన నేత ప్రధాని అయ్యేవారు: రౌత్‌

అటు శివసేన మరో సీనియర్‌ నాయకుడు, ఎంపీ సంజయ్‌ రౌత్‌ కూడా కమలం పార్టీపై విమర్శలు చేశారు. భాజపా కోసం తాము ఉత్తర భారతదేశంలో పోటీకి దూరమయ్యాయమని, లేదంటే తమ పార్టీ నేత దేశానికి ప్రధాని అయ్యేవారని చెప్పారు. ‘‘మహారాష్ట్రలో అట్టడుగు స్థాయిలో ఉన్న భాజపాను టాప్‌లోకి తీసుకొచ్చింది మేమే. బాబ్రీ ఘటన తర్వాత ఉత్తర భారతంలో శివసేన హవా నడిచింది. ఆ సమయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో పోటీ కూడా చేయాలని భావించాం. కానీ భాజపా కోసమే వెనక్కి తగ్గాం. లేదంటే దేశంలో శివసేన నేత కూడా ప్రధాని అయ్యేవారు’’ అని రౌత్‌ చెప్పుకొచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని