Shashi Tharoor: నేనే అధ్యక్షుడినైతే.. హైకమాండ్ సంస్కృతిని మార్చేస్తా!

అధికార వికేంద్రీకరణే కాంగ్రెస్‌(Congress) పార్టీలో సమస్యలకు పరిష్కారమని శశిథరూర్‌(Shashi Tharoor) పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే పార్టీలో హైకమాండ్‌ సంస్కృతి...

Published : 30 Sep 2022 18:43 IST

దిల్లీ: అధికార వికేంద్రీకరణే కాంగ్రెస్‌(Congress) పార్టీలో సమస్యలకు పరిష్కారమని శశిథరూర్‌(Shashi Tharoor) పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే పార్టీలో హైకమాండ్‌ సంస్కృతి(High Command Culture‌)ని మారుస్తానని హామీ ఇచ్చారు. గురువారం నామినేషన్‌ అనంతరం థరూర్‌ విలేకరులతో మాట్లాడారు. పార్టీకి పునర్‌వైభవం తీసుకురావడం, నాయకత్వంలో కొత్తదనం, పార్టీ సిద్ధాంతాన్ని చాటడం, అందరి భాగస్వామ్యాన్ని పెంచడం, యువతపై దృష్టి సారించడం వంటివి లక్ష్యాలుగా చెబుతూ.. తన విజన్‌ను వివరించారు. పోటీలో నిలిచిన మరో నేత మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge)ను ‘కాంగ్రెస్‌ భీష్మ పితామహుడి’గా అభివర్ణించిన థరూర్‌.. ఆయనతో ఎలాంటి వైరి లేదని చెప్పారు. తాము ప్రత్యర్థులం కాదని, సహచరులమని స్పష్టం చేశారు.

పార్టీ విషయాలను ప్రతిదీ దిల్లీలోని హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లే అంశాన్ని ప్రస్తావిస్తూ‌.. కాంగ్రెస్ అధ్యక్షుడిదే తుది నిర్ణయమని తీర్మానాలు చేసేవారు పార్టీలో ఉండకూడదన్నారు. ఖర్గేను.. పార్టీని ఎప్పటిలాగే నడిపించే వ్యక్తిగా పేర్కొంటూ.. తాను మాత్రం కొత్త దృక్పథాన్ని, విధానాలను తీసుకొస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఖర్గేకు పార్టీ సీనియర్‌ నేతలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై థరూర్‌ మాట్లాడుతూ.. ‘పార్టీని ఇలాగే కొనసాగించాలనుకునేవారి వెనుక అధిష్ఠానం కలిసి రావడంలో ఆశ్చర్యం లేదు. అయితే.. మార్పు, పురోగతి కావాలంటే నాకు ఓటేయండి. అట్టడుగు స్థాయిలోనూ సాధికారత కల్పిస్తా’ అని చెప్పారు. తాను ముగ్గురు గాంధీలను కలిశానని, పోటీ వాతావరణం పార్టీని బలోపేతం చేస్తుందని వారు తెలిపారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని