Karnataka: మళ్లీ నేనే సీఎం అన్న బొమ్మై.. కలలు కనొద్దంటూ కాంగ్రెస్‌ కామెంట్‌!

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సమాజంలో అన్ని వర్గాల వారి సామాజిక న్యాయం కోసం నిజాయితీగా కృషి చేశానని కర్ణాటక (Karnataka) సీఎం బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai) చెప్పారు.

Published : 23 Mar 2023 01:38 IST

బెంగళూరు: కన్నడనాట శాసనసభ ఎన్నికలు (Karnataka Assebly Elections) సమీపిస్తున్నవేళ అధికార, విపక్షాలు గెలుపే లక్ష్యంగా కృషిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai) భాజపా (BJP) గెలుస్తుందని, మళ్లీ తానే సీఎంగా ప్రమాణం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర కర్ణాటకలోని బాగల్‌కోటె (Bagalkote) జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సమాజంలో అన్ని వర్గాల వారి సామాజిక న్యాయం కోసం నిజాయితీగా కృషి చేశానని చెప్పారు. తమ పరిపాలనతో గత నాలుగేళ్లలో రాష్ట్రంలో ప్రజల వార్షిక తలసరి ఆదాయం రూ. లక్ష పెరిగిందని అన్నారు. 

‘‘మరోసారి సీఎం అవుతాననే నమ్మకం నాకుంది. కర్ణాటక ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని దేవుడు నాకిచ్చాడు. బసవేశ్వరుడి ఆదర్శాల స్ఫూర్తితో సామాజిక న్యాయం, అభివృద్ధి కోసం నిజాయితీగా నా వంతు కృషి చేశాను. గతంలో రాష్ట్రంలో ప్రజల వార్షిక తలసరి ఆదాయం రూ. 2.42 లక్షలుగా ఉండేది. ప్రస్తుతం అది రూ. 3.47 లక్షలకు పెరిగింది. కరోనా సమయంలో కూడా మేము అభివృద్ధిని కొనసాగించాం. భాజపా అధికారం చేపట్టిన తర్వాత పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల జాబితాలో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ తర్వాత రాష్ట్రానికి రూ. 12 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రం అభివృద్ధి పథంలో కొనసాగాలంటే భాజపాకు ఓటేయాలి’’ అని బొమ్మై ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

బొమ్మై వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్(Congress) విమర్శలు గుప్పించింది.  ప్రధాని మోదీ (PM Narendra Modi), హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) ఎన్నికల ప్రచారంలో బొమ్మై గురించి మాట్లాడటంలేదని, మరోసారి సీఎం కావాలనే ఆయన కోరిక కలగానే మిగిలిపోతుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రిజ్వాన్‌  అర్షన్‌ ఎద్దేవా చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని