Kejriwal: కలలో కూడా ఆయనకు నేను దెయ్యంలాగే కనబడతా: కేజ్రీవాల్‌

ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ ప్రజల కోసం పనిచేసి ఉంటే తనలాంటి వ్యక్తులకు......

Published : 05 Feb 2022 02:17 IST

కాంగ్రెస్‌ అలా చేసుంటే తాను రాజకీయాల్లోకి వచ్చేవాణ్ని కాదన్న దిల్లీ సీఎం

పనాజీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ ప్రజల కోసం పనిచేసి ఉంటే తనలాంటి వ్యక్తులకు అసలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరమే ఉండేది కాదన్నారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌ సూర్జేవాలా నిన్న కేజ్రీవాల్‌ని ఛోటా మోదీ అనీ.. ఈ ఎన్నికల్లో ఓడిపోబోతున్న భాజపాకు లబ్ధి చేకూర్చేందుకే గోవా వచ్చారంటూ చేసిన ఆరోపణల నేపథ్యంలో విలేకర్లతో మాట్లాడారు. ‘నన్ను ఏం కావాలంటే అది అనుకోనివ్వండి.. దాని వల్ల ప్రయోజనమేమిటి? వాస్తవానికి రణ్‌దీప్‌ సూర్జేవాలా కలలో కూడా నేను దెయ్యంలానే కనబడతా. 24గంటలూ ఆయన ఆలోచనల్లోనే ఉంటాను.  కాంగ్రెస్‌ నేతలు ఎప్పుడూ నన్ను దూషిస్తూనే ఉంటారు. ప్రజల కోసం మేము బాగా పనిచేసినందువల్లే మా పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తున్నారు’ అని కేజ్రీవాల్‌ అన్నారు.

గోవాలో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆప్‌ నేతల్లాగే అఫిడవిట్లపై సంతకాలు చేయడం, పార్టీకి విధేయంగా ఉంటామంటూ  కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో ప్రతిజ్ఞలు చేయడంపైనా కేజ్రీవాల్‌ స్పందించారు. ఆప్‌లోని మంచి అంశాలను కాపీ కొట్టడాన్ని తాము స్వాగిస్తున్నామన్నారు. ‘‘మేం చేపడుతున్న అంశాల్ని కాపీ కొట్టనీయండి.. మేం అమలు చేస్తున్న పథకాలు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల్లోనూ అమలు చేయాలనే మేం కోరుకుంటున్నాం. కాంగ్రెస్‌ని అన్ని మంచి పనులు చేయనివ్వండి.. అప్పుడు నేను రాజకీయ పార్టీ నడపాల్సిన అవసరం ఉండదు కదా’’ అంటూ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని