Assembly Elections 2022: కాంగ్రెస్ ఒరిజినల్.. ఆప్‌ జిరాక్స్‌..!

కొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 17 Feb 2022 02:41 IST

విపక్ష పార్టీలపై మోదీ తీవ్ర విమర్శలు

చండీగఢ్‌: కొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పఠాన్‌ కోట్‌లో ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌)పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌కు ఆప్‌ జిరాక్స్‌ అని మండిపడ్డారు. సైనికుల త్యాగాలను కాంగ్రెస్ అవమానించిందని ఈ సందర్భంగా తీవ్ర ఆరోపణలు చేశారు. 

కాంగ్రెస్ అసలు.. ఆప్‌ జిరాక్స్‌:

‘పంజాబ్‌ను ముందుకు నడిపించాలని మేం చూస్తున్నాం. మిగిలిన పార్టీలన్నీ ఈ రాష్ట్రాన్ని రాజకీయ కోణంలోనే చూస్తాయి. కెప్టెన్‌ సాహెబ్‌(అమరీందర్‌ సింగ్‌) కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆ పార్టీ తప్పు దిశలో వెళ్లకుండా నిరోధించారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. ఇక కాంగ్రెస్ అసలు అయితే.. ఆప్‌ దాని జిరాక్స్‌. ఒకరు పంజాబ్‌ను దోచుకుంటుంటే.. ఇంకొకరు దిల్లీలో కుంభకోణాలకు పాల్పడ్డారు. వారు ఆయోధ్య ఆలయం విషయంలో లేక సైన్యం కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు వారు సంతోషంగా ఉండరు. అలాంటి వారిని అస్సలు సహించకూడదు. ఈ రెండు పార్టీలు ఒకరికి ఒకరు వ్యతిరేకం అన్నట్లు నటిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కోసం భాజపాకు ఓటేయాలి’ అని మోదీ ఓటర్లను కోరారు. 

‘గతంలో నేను పఠాన్‌కోట్‌కు వచ్చాను. ఇక్కడ వారు నాకు ఆహారం అందించారు. మీ రొట్టె తినే ఎదిగాను. భాజపాకు, నాకు పంజాబ్‌కు సేవ చేసే అవకాశం రాలేదు. పంజాబ్‌లో శాంతి కోసం గతంలో కూటమిలో పనిచేశాం’ అని గుర్తుచేశారు.    

సైనికుల త్యాగాలపై కాంగ్రెస్ చిన్నచూపు..

‘2016 పఠాన్‌కోట్‌ ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల త్యాగాలను కాంగ్రెస్ అవమానించింది. ఆ దాడిపై కాంగ్రెస్ పార్టీ ఒక్కటే భిన్నంగా స్పందించింది. వారు ప్రభుత్వాన్ని, పంజాబ్‌ ప్రజల్ని, చివరకు మన సైన్యం త్యాగాలను ప్రశ్నించారు. 2019 పుల్వామా ఉగ్రదాడి విషయంలో కూడా కాంగ్రెస్ ఇదే తరహాలో ప్రవర్తించింది. కాంగ్రెస్‌కు వీడ్కోలు పలకాలి’ అని ప్రధాని విమర్శించారు. అలాగే కర్తార్‌పూర్ కారిడార్ గురించి ప్రస్తావించారు. తమ ప్రభుత్వ ప్రయత్నం వల్లే అది సాధ్యమైందనన్నారు. మరోపక్క ఈ కరోనా సమయంలో తమ ప్రభుత్వం కోట్ల మంది ప్రజానీకానికి ఉచిత రేషన్ అందించిందన్నారు. 

ఇదిలా ఉండగా.. 2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 40 మంది సైనికులు మరణించారు. దానికి ప్రతిగా భారత్‌ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నలు వేసి, భాజపా నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని