Kejriwal: కేజ్రీవాల్‌ ముఖ్యం కాదు.. దేశం కోసం నా ప్రాణమైనా ఇస్తా: దిల్లీ సీఎం

తన నివాసం ఎదుట బీజేవైఎం ఆందోళనకారులు చేపట్టిన విధ్వంసంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో

Updated : 01 Apr 2022 06:24 IST

దిల్లీ: తన నివాసం ఎదుట బీజేవైఎం ఆందోళనకారులు చేపట్టిన విధ్వంసంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీనే దాదాగిరీకి పాల్పడుతూ.. ఈ సమాజానికి ఏం సందేశమివ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. ఈ దేశం కోసం తాను చావడానికైనా సిద్ధమని అన్నారు.

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రాన్ని అవాస్తవ చిత్రం అంటూ వ్యాఖ్యలు చేసి కశ్మీరీ పండితులను ఎగతాళి చేసినందుకు క్షమాపణ చెప్పాలని కోరతూ బీజేవైఎం అధ్యక్షుడు తేజస్వి సూర్య ఆధ్వర్యంలో భాజపా కార్యకర్తలు బుధవారం కేజ్రీవాల్‌ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఎన్నికల్లో తమను ఓడించలేక కేజ్రీవాల్‌ను చంపాలని ప్రయత్నిస్తోందని దుయ్యబట్టింది.

ఈ ఘటనపై తాజాగా కేజ్రీవాల్‌ స్పందిస్తూ భాజపాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యం కాకపోవచ్చు. కానీ, దేశం ముఖ్యం. ఈ దేశం కోసం నా ప్రాణాలు అర్పించేందుకైనా నేను సిద్ధంగా ఉన్నా. ఇలాంటి దౌర్జన్యాలతో భారత అభివృద్ది చెందదు. దేశంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీనే ఇలాంటి దాదాగిరీకి పాల్పడితే.. ఇది ప్రజల్లోకి తప్పుడు సందేశాన్ని తీసుకెళ్తుంది. ఏదైనా సమస్యను పరిష్కరించడానికి దౌర్జన్యమే సరైన మార్గమేమో అని ప్రజలు భావిస్తారు’’ అని కేజ్రీవాల్‌ విమర్శించారు.

దిల్లీ హైకోర్టుకు ఆప్‌..

కేజ్రీవాల్ ఇంటి ముందు దాడి ఘటనపై ఆమ్‌ ఆద్మీ పార్టీ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని కోరుతూ ఆప్‌ ఎమ్మెల్యే సౌరభ్‌ భరద్వాజ్‌ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని