kejriwal: సిసోదియా నేడు భాజపాలో చేరి ఉంటే..!: ప్రధానిపై కేజ్రీవాల్‌ విమర్శలు

పంజాబ్‌లో ఆప్‌ గెలిచినప్పట్నుంచి భాజపా సహించలేకపోతోందని.. దిల్లీలో ప్రజలకు చేస్తోన్న పనుల్ని అడ్డుకొనేందుకు సిసోదియా, జైన్‌లను అరెస్టు చేసినట్టు కేజ్రీవాల్‌ ఆరోపించారు. ప్రధాని మోదీని టార్గెట్‌ చేసుకొని పలు విమర్శలు గుప్పించారు.

Published : 02 Mar 2023 01:14 IST

దిల్లీ: ఆప్‌ కీలక నేత మనీశ్‌ సిసోదియా(Manish sisodia)ను అరెస్టు చేయడం ద్వారా విద్య, ఆరోగ్యరంగాల్లో తమ ప్రభుత్వ పనితీరును దెబ్బ తీసేందుకు భాజపా ప్రయత్నిస్తోందని దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ (Arvind kejriwal)ఆరోపించారు. సిసోదియాను సీబీఐ అరెస్టు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిసోదియా, సత్యేందర్‌ జైన్‌లను చూసి ఆప్‌ మాత్రమే కాదు.. యావత్‌ దేశమే గర్వపడుతుందన్నారు. దేశానికి కీర్తి తెచ్చేలా పనిచేసిన ఆ ఇద్దరినీ ప్రధాని కటకటాల్లోకి నెట్టారని ఆక్షేపించారు. బుధవారం సాయంత్రం దిల్లీలో విలేకర్లతో మాట్లాడారు. దిల్లీలో తాము చేస్తోన్న మంచి పనిని ప్రధాని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇందుకు మద్యం పాలసీ కేసు ఒక సాకు మాత్రమేనీ.. అక్కడ ఎలాంటి కుంభకోణమూ లేదన్నారు. సిసోదియా, సత్యేందర్‌ జైన్‌ చేసిన పనిని అతిషి, సౌరభ్‌ భరద్వాజ్‌లు రెట్టింపు వేగంతో కొనసాగిస్తారన్నారు. ఒకవేళ సత్యేందర్‌ జైన్‌, సిసోదియా ఈరోజు భాజపాలో చేరి ఉంటే .. రేపే స్వేచ్ఛగా జైలు నుంచి బయటకు వచ్చేవారన్నారు. వారిద్దరిపై ఉన్న కేసులన్నీ ఉపసంహరించుకొనేవారని దుయ్యబట్టారు. ఆప్‌ను ఇప్పుడు అడ్డుకోలేరని.. తమకు టైం వచ్చిందని మోదీకి చెప్పదలచుకున్నామని కేజ్రీవాల్‌ అన్నారు.

అలాంటిదేమీ జరగదు.. హామీ ఇస్తున్నా..

‘‘భాజపా నేతలు ఆప్‌ను అడ్డుకోవాలనుకుంటున్నారు. పంజాబ్‌లో తాము గెలిచినప్పట్నుంచి వారు సహించలేకపోతున్నారు. ఇక్కడ అవినీతి సమస్య కాదు.. తమ మంత్రులు చేస్తున్న మంచి పనులు ఆగిపోవాలన్నదే భాజపా లక్ష్యం.  ఒకవేళ సిసోదియా భాజపాలో చేరితే.. రేపటికల్లా స్వేచ్ఛగా తిరిగేవాడు కదా? అని ప్రశ్నించారు. వాళ్ల అజెండా  దిల్లీలో జరుగుతున్న మంచి పనుల్ని ఆపడమే. అలాంటిదేమీ జరగబోదని దిల్లీ ప్రజలకు హామీ ఇస్తున్నా. ఇంటింటికీ వెళ్లి క్యాంపెయిన్‌ నిర్వహించాలని ఆప్‌ నిర్ణయించుకుంది. ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి ఒకప్పుడు ఇందిరాగాంధీలా ప్రధాని నరేంద్ర మోదీ ఏ విధంగా వ్యవహరిస్తున్నారో వివరిస్తాం. వాళ్లే తగిన సమాధానం చెబుతారు. ప్రజలు ప్రతిదీ చూస్తున్నారు. అంతా కోపంగా ఉన్నారు’’ అని కేజ్రీవాల్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని