Sanjay Raut: రాహుల్‌ వైభవం ఇలాగే కొనసాగితే.. దేశ రాజకీయాల్లో కొత్త మార్పు: సంజయ్‌ రౌత్‌

రాహుల్‌ గాంధీ వైభవం ఇలాగే కొనసాగితే.. దేశ రాజకీయాల్లో కొత్త మార్పు వస్తుందని సంజయ్‌ రౌత్‌ అన్నారు.

Published : 01 Jan 2023 13:44 IST

ముంబయి: కాంగ్రెస్‌  నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) నాయకత్వం 2022లో కొత్త వైభవం సంతరించుకుందని శివసేన (ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే) నేత సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) అన్నారు. అది 2023లోనూ అలాగే కొనసాగితే.. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి దేశ రాజకీయాలు కొత్త మార్పును చూస్తాయని జోస్యం చెప్పారు. ప్రతి ఆదివారం పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో రాసే వ్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు అధికార భాజపాపై రౌత్‌ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా విద్వేష, విభజన విత్తనాలు నాటొద్దని హితవు పలికారు. రామ మందిర నిర్మాణ అంశానికి పరిష్కారం దొరికిందని తెలిపారు. ఇక దీన్ని ఆసరాగా చేసుకొని ఓట్లు అడిగే పరిస్థితులు లేవన్నారు. ఈ నేపథ్యంలో ‘లవ్‌ జిహాద్‌’ అనే కొత్త అంశాన్ని భాజపా తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు. ఈ ఆయుధాన్ని వాడుకొని ఓ వర్గంలో భయాన్ని సృష్టించి తద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలనుకుంటున్నారా? అని భాజపాను ప్రశ్నించారు. నటి తునీషా శర్మ, శ్రద్ధా వాకర్‌ హత్యలు లవ్‌ జిహాదీ కింద జరిగినవి కాదని వ్యాఖ్యానించారు. అయితే, మహిళలు ఏవర్గానికి చెందిన వారైనా.. వారిపై దాడులు సరికాదన్నారు.

2023లోనైనా భారత్‌ భయం గుప్పిట్లో నుంచి బయటపడాలని ఆకాంక్షిస్తున్నానని రౌత్‌ అన్నారు. రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర విజయవంతమవ్వాలని కోరుకుంటున్నానన్నారు. సంకుచిత ఆలోచనా ధోరణిని విడనాడాలని మోదీ తరచూ చెబుతూ ఉంటారని అన్నారు. కానీ, ఆ వైఖరి భాజపాలోనే అధికంగా ఉందన్నారు. విపక్ష పార్టీలకు ఉన్న హక్కుల్ని గుర్తించడానికి కూడా పాలకులు సుముఖంగా లేరని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని