TMC: రాహుల్‌పై అనర్హత వేటు సరే.. మరి ప్రధానిపై ఎందుకు చర్యలు తీసుకోరు?

రాహుల్‌ గాంధీపై (Rahul Gandhi) అనర్హత వేటు వేసిన తీరును తప్పుపడుతున్నట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) పేర్కొంది. ఇదే సమయంలో మమతా బెనర్జీని (Mamata Banerjee) విమర్శిస్తూ మహిళల మనోభావాలు దెబ్బతీసిన ప్రధానమంత్రిపై చర్యలు ఎందుకు తీసుకోరని ప్రశ్నించింది.

Published : 30 Mar 2023 01:51 IST

కోల్‌కతా: ఓ క్రిమినల్ పరువునష్టం కేసులో సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పార్లమెంట్‌ సభ్యత్వాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌ సెక్రటేరియట్‌ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టిన కాంగ్రెస్‌కు (Congress) విపక్ష పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో ఓ వర్గంపై వ్యాఖ్యలు చేశారనే కారణంతో రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేస్తే.. మమతా బెనర్జీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ మహిళల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన ప్రధానమంత్రి మోదీపై చర్యలు ఎందుకు తీసుకోరని టీఎంసీ (TMC) సీనియర్‌ నేత అభిషేక్‌ బెనర్జీ విమర్శలు గుప్పించారు.

‘రాహుల్‌ గాంధీపై అనర్హత వేటుకు కారణమైన ఆయన వ్యాఖ్యలకు మద్దతు తెలపను. కానీ, ఆయనపై అనర్హత వేటు వేసిన తీరును మాత్రం ఖండిస్తున్నా. 2021 ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘దీదీ ఓ దీదీ’ అంటూ మమతా బెనర్జీని అవమానిస్తూ ప్రధానమంత్రి చేసి వ్యాఖ్యలకు గాను ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోరు? ఆ కేసులోనూ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. అంతేకాకుండా ఓ మహిళా మంత్రిని అవమానించేలా బెంగాల్‌ భాజపా నేత సువేందు అధికారి కూడా వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఫిర్యాదు చేయాలని కార్యకర్తలకు సూచిస్తున్నా’ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ పేర్కొన్నారు.

మరోవైపు, పరువు నష్టం కేసులో సూరత్ న్యాయస్థానం విధించిన జైలుశిక్షపై కాంగ్రెస్(Congress) పైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు పిటిషన్ సిద్ధమైనట్లు సమాచారం. త్వరలోనే సవాలు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రివ్యూ పిటిషన్‌పై పార్టీకి చెందిన న్యాయసలహాదారులు అన్ని మార్గాలను పరిశీలిస్తున్నారని, ఒకట్రెండు రోజుల్లో దీనిని దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు