Maharashtra Crisis: ‘శివసైనికులు గనక బయటకొస్తే..’ సంజయ్‌ రౌత్‌ ఘాటు హెచ్చరిక

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై తాజాగా శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు శివసైనికులు ఓర్పుతో ఉన్నారని వ్యాఖ్యానించారు....

Updated : 25 Jun 2022 15:18 IST

ముంబయి: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై తాజాగా శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు శివసైనికులు ఓర్పుతో ఉన్నారని వ్యాఖ్యానించారు. సమయం గడుస్తున్న కొద్దీ వారి సహనం నశిస్తోందన్నారు. ఇంకా వారు బయటకు రాలేదన్నారు. ‘‘ఒకవేళ వారే గనక బయటకొస్తే వీధుల్లో అగ్గి రాజేసుకుంటుంది’’ అని హెచ్చరించారు. తాజా సంక్షోభం నేపథ్యంలో పార్టీ నేడు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. దానికి వెళ్లడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో శుక్రవారం రాత్రి భేటీ అయినట్లు సంజయ్‌ రౌత్‌ తెలిపారు. ఆ సమయంలో పది మంది రెబల్‌ ఎమ్మెల్యేల నుంచి తమకు ఫోన్‌ వచ్చిందని వెల్లడించారు. సభలో విశ్వాస పరీక్షకు రావాలని సవాల్‌ విసిరారు. అప్పుడు ఎవరు బలవంతులో తేలుతుందని వ్యాఖ్యానించారు. నేడు జరగబోయే సమావేశంలో పార్టీ విస్తరణ, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామన్నారు. శివసేన చాలా పెద్దది అని.. దాన్ని ఎవరూ హస్తగతం చేసుకోలేరని వ్యాఖ్యానించారు. ఎన్నో త్యాగాల వల్ల పార్టీ నిర్మాణం జరిగిందన్నారు. దాన్ని ధనబలంతో ఎవరూ ధ్వంసం చేయలేరన్నారు.

మరోవైపు పుణెలోని రెబల్‌ ఎమ్మెల్యే తానాజీ సావంత్‌ కార్యాలయంపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. ప్రస్తుతం ఆయన శిందే వర్గంతో కలిసి గువాహటిలో ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని