Maharashtra Crisis: ఫడణవీస్‌ ప్రమాణ స్వీకారం రేపేనా..? శిందే వర్గం ఏ చెప్పిందంటే..?

మహారాష్ట్రలో సంకీర్ణ కూటమి(MVA) కూలిపోవడంతో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.

Published : 30 Jun 2022 14:55 IST

ముంబయి: మహారాష్ట్రలో సంకీర్ణ కూటమి(MVA) కూలిపోవడంతో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. దానిలో భాగంగా శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తోన్న ఏక్‌నాథ్ శిందే ముంబయికి చేరుకున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలంతా గోవాలోనే ఉండగా.. ఈయన ప్రైవేట్‌ జెట్‌లో నగరానికి వచ్చారు. శిందే, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ మధ్యాహ్నం మూడు గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు. శిందే వర్గం మద్దతుతో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం , ఫడణవీస్ ముఖ్యమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రమాణస్వీకారం కార్యక్రమం రేపు జరిగితే.. రేపే తాము ముంబయి వెళ్తామని రెబల్ వర్గంలోని ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ మీడియాకు చెప్పిన మాటలు చూస్తుంటే ఇదే విషయం స్పష్టం అవుతోంది.  

‘ప్రమాణస్వీకారం తేదీపై ఫడణవీస్ నిర్ణయం తీసుకుంటారు. రేపే ప్రమాణ స్వీకారం జరిగితే.. రేపే మేమంతా(అసమ్మతి ఎమ్మెల్యేలు) ముంబయి వెళ్తాం. ప్రభుత్వ ఏర్పాటుపై మా చర్చలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. మేము ఠాక్రే కుటుంబానికి వ్యతిరేకం కాదు. ఆయన కాంగ్రెస్‌, ఎన్‌సీపీతో తెగదెంపులు చేసుకుంటే.. ఇప్పటికీ ఆయనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ ఆయన ఇప్పటికీ వారితోనే ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లలేదు. ఠాక్రేపై మా గౌరవం అలాగే ఉంది. 

శిందే ముంబయి వెళ్లారు. ఏ నిర్ణయం తీసుకున్నా.. అది రాష్ట్ర అభివృద్ధి కోసమేనని ఆయన చెప్పారు. మేం ఎవరికి వెన్నుపోటు పొడవలేదు. సంజయ్ రౌత్ చేసే ఆ తరహా ప్రకటనలు ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయి. అలాగే నిన్న ఠాక్రే రాజీనామా చేసినప్పుడు మేం ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. ఆయనను దింపడం మా ఉద్దేశం కాదు. మేం ఇప్పటికీ శివసేనలోనే ఉన్నాం. ఠాక్రేను అగౌరవపరచడమనేది అసలు మా ఉద్దేశం కాదు’ అని కేసర్కర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తామంతా రెండు వర్గాలుగా ఉన్నా.. అంతా శివసేనకు చెందినవారమేనన్నారు. అందుకే ఇప్పటికీ శాసనసభాపక్ష నేత శిందేనేనని వెల్లడించారు. మరోపక్క, అసమ్మతి వర్గం అసెంబ్లీలో విప్‌ జారీ చేయనుంది. ఈ విప్‌ ఉద్ధవ్ వర్గంలోని 16 మంది ఎమ్మెల్యేలకు కూడా వర్తించనున్నట్లు తెలుస్తోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని