Hanuman chalisa Row: ‘దాదాగిరి చేస్తే..’.. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వార్నింగ్‌!

‘హనుమాన్‌ చాలీసా’ వ్యవహారంలో చెలరేగిన రాజకీయ వివాదంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తీవ్రస్థాయిలో స్పందించారు. తన ఇంటి వద్ద హనుమాన్‌ చాలీసా పఠిస్తే .....

Published : 26 Apr 2022 01:42 IST

ముంబయి: ‘హనుమాన్‌ చాలీసా’ వ్యవహారంలో చెలరేగిన రాజకీయ వివాదంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తీవ్రస్థాయిలో స్పందించారు. తన ఇంటి వద్ద ‘హనుమాన్‌ చాలీసా’ పఠిస్తే ఎలాంటి ఇబ్బందీ లేదన్న ఆయన.. దాదాగిరి చేస్తే మాత్రం సహించబోమన్నారు. హనుమాన్‌ చాలీసా పఠించాలనుకుంటే తమ ఇంటికి రావొచ్చన్న ఉద్ధవ్‌.. దానికో పద్ధతి అంటూ ఉంటుందన్నారు. ఒకవేళ దాదాగిరి చేయాలని చూస్తే.. ఏంచేయాలో తమకు బాలాసాహెబ్‌ బాల్‌ ఠాక్రే నేర్పించారన్నారు. శివసేనను సవాల్‌ చేస్తే తమ ఉగ్రరూపమేంటో చూపిస్తామంటూ ఓ కార్యక్రమంలో భాజపాను ఉద్దేశించి పరోక్షంగా ఉద్ధవ్‌ హెచ్చరికలు చేశారు.

‘‘శివసేన హిందుత్వను వదిలిపెట్టిందంటూ గత కొన్ని రోజులుగా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. హిందుత్వ ఏమైనా మనం వేసుకొని వదిలేసే దోతిలాంటిదా? ఇక్కడ మనం ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. హిందుత్వం గురించి మనకు ఉపన్యాసాలు ఇస్తున్న వారు దాని కోసం ఏం చేశారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బాబ్రీ మసీదును కూల్చినప్పుడు మీరు మీ గుంతలోకి పారిపోయారు. రామ మందిరం నిర్మించాలన్న నిర్ణయం మీ ప్రభుత్వం నుంచి వచ్చింది కాదు.. కోర్టు ద్వారా వచ్చింది. ఆలయం నిర్మించేటప్పుడు కూడా ప్రజల ముందు చేయి చాచారు. మీ హిందుత్వం ఎక్కడుంది? శివసేన హిందుత్వను విడిచిపెట్టిందని అనడంలో మీ ఉద్దేశమేంటి?’’ అని ప్రశ్నించారు. తన ప్రత్యర్థులకు సరైన సమాధానం చెప్పేందుకు త్వరలోనే బహిరంగ సభలో ప్రసంగించనున్నట్టు ఉద్ధవ్‌ తెలిపారు.

ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠించి తీరతామంటూ నవనీత్‌ కౌర్‌ రాణా, ఆమె భర్త రవి రాణా సవాల్‌ విసరడం ముంబయిలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి రాజద్రోహం కేసు నమోదు చేశారు. వారిని బాంద్రా మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఎదుటహాజరు పరచగా.. రెండు వారాల పాటు జుడీషియల్‌ కస్టడీ విధించారు. దీంతో తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ రాణా దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. దీంతో వారు సెషన్సు కోర్టును ఆశ్రయించగా.. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మంగళవారం జరిగే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని