‘నేను పులిలాంటిదాన్ని.. వారికి తల వంచను’ 

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు తమ ప్రచారాస్త్రాలకు మరింతగా పదును పెంచాయి. భాజపా- తృణమూల్‌ కాంగ్రెస్‌......

Updated : 18 Mar 2021 17:38 IST

భాజపాతో దీదీ మాటల యుద్ధం

తూర్పు మిడ్నాపూర్‌‌: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు తమ ప్రచారాస్త్రాలకు మరింతగా పదును పెంచాయి. భాజపా- తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గురువారం తూర్పు మిడ్నాపూర్‌, అమ్లాసులి తదితర చోట్ల ప్రచారంలో పాల్గొన్న సీఎం మమతా బెనర్జీ భాజపాపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తాను పులి లాంటిదాన్నని, ప్రజల ముందు తప్ప ఎవరికీ తలవంచబోనన్నారు. భాజపా మహిళలు, దళితులను హింసిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాత్రమే హెలికాప్టర్లు, విమానాల్లో బయటి నుంచి వచ్చి ఓటర్లను ప్రలోభపెట్టి ఆకర్షించేందుకు భాజపా నేతలు  వస్తారని,  సంక్షోభాల సమయంలో వారెక్కడా కనబడరన్నారు. 

అంపన్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కోసం తమ ప్రభుత్వం రూ.వేల కోట్లు ఖర్చుచేసిందన్నారు. ఆ సమయంలో ఒకటి రెండు తప్పులు జరిగి ఉండొచ్చనీ.. కానీ ప్రజల కోసం తాము పరుగులు పెట్టి పనిచేశామన్నారు. ఆ సమయంలో భాజపా ఎక్కడ ఉందని దీదీ ప్రశ్నించారు. నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌)ను రాష్ట్రంలో అనుమతించబోమన్నారు. ఎన్యుమరేటర్లు వచ్చే సమయంలో ఇంట్లో లేని వ్యక్తులను ఓటర్లుగా భాజపా తీసేస్తుందని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఎన్‌పీఆర్‌ ప్రక్రియను రాష్ట్రంలోకి అనుమతించబోదని మమత స్పష్టంచేశారు.

మరోవైపు, ఈ రోజు బెంగాల్‌లోని పురూలియాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. మమత పాలనపై మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ఆట మొదలైందని దీదీ చెబుతున్నారని.. కానీ భాజపా మాత్రం అభివృద్ధి మొదలైంది అంటోందన్నారు. టీఎంసీ అంటే ట్రాన్స్‌ఫర్‌ మై కమిషన్‌ పార్టీ అని ప్రధాని ఎద్దేవాచేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని