Eknath Shinde: ‘2024లో ఎన్డీయేదే పవర్‌.. మోదీ అన్ని రికార్డులూ బ్రేక్‌ చేస్తారు’

2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో (Lok sabha polls 2024) ఎన్డీయే (NDA) భారీ విజయం సాధిస్తుందని, ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రికార్డులన్నీ బ్రేక్‌ చేస్తారని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే (Eknath sindhe) వ్యాఖ్యానించారు.

Published : 28 Jan 2023 01:19 IST

ఠానే: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Sindhe) రాజకీయ సర్వే ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే (NDA) ప్రభుత్వమే భారీ మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తుందని.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్ని రికార్డుల్ని బ్రేక్‌ చేస్తారని శిందే వ్యాఖ్యానించారు. విద్యార్థుల్లో పరీక్షలపై ఉన్న భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నిర్వహించిన ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో సీఎం లైవ్‌లో పాల్గొన్నారు. ఠానేలోని కిసాన్‌ నగర్‌లో తాను చదువుకున్న మున్సిపల్‌ పాఠశాలలో విద్యార్థులతో కలసి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.

ఈ సందర్భంగా 2024 లోక్‌సభ ఎన్నికలపై ఇటీవల ఓ మీడియా సంస్థ నిర్వహించిన రాజకీయ సర్వే ఫలితాలపై విలేకర్లు ఆయన్ను ప్రశ్నించగా ‘‘వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎన్డీయే, మోదీదే హవా’’ అని ఏక్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. అలాగే, కేవలం కొద్ది మంది వ్యక్తులతో నిర్వహించిన సర్వేలో వాస్తవ చిత్రాన్ని చూపించవన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను ఆ సర్వేలో విస్మరించారన్న ఆయన... ‘బాలాసాహెబంచి శివసేన’ (శిందే వర్గం), భాజపా మంచి పనితీరును కనబరిచాయని తెలిపారు.

(విద్యార్థులతో కలిసి పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న శిందే)

మొత్తం వాతావరణాన్నే మార్చేశాం!

రాజకీయాల్లో 2+2 ఎప్పటికీ నాలుగు కాదన్న శిందే.. ఎంతమందితో సర్వే చేశారో తన వద్ద వివరాలు ఉన్నాయని చెప్పారు. ఆ అంకెల జోలికి తాను వెళ్లదలచుకోలేదని  కూడా చెప్పారు. తాను సీఎం కావడానికి ముందు రెండున్నరేళ్ల పాటు ప్రతికూలతతో కూడిన ప్రభుత్వం (ఉద్ధవ్‌ సారథ్యంలోని మహావికాస్‌ అఘాడీ సర్కార్‌) మహారాష్ట్రలో అధికారంలో ఉండేదని.. కానీ ఇప్పుడు సానుకూలతతో కూడిన ప్రభుత్వం పాలిస్తోందన్నారు. గత ప్రభుత్వ పాలనపై రాష్ట్రంలో అసంతృప్తి ఉందన్న ఆయన.. తాము అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి పనులు ప్రారంభించడంతో పాటు మొత్తం వాతావరణాన్నే మార్చేశామన్నారు. రాజకీయాల్లో ఎవరు ఎవరితో చేతులు కలుపుతారో, ఎవరి పొత్తు ఎప్పుడు వీడుతుందో ఇప్పుడు తాను కూడా చెప్పలేనంటూ శిందే వ్యాఖ్యానించారు.

కానీ, మహారాష్ట్రలో బాలాసాహెబంచి శివసేన, భాజపా సారథ్యంలోని ప్రభుత్వం సామాన్యుల కోసం బాగా పనిచేస్తోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో ప్రజలు ఇప్పటికే డిసైడ్‌ అయిపోయారని.. ప్రజల స్పందన తమకు అర్థమైందని వ్యాఖ్యానించారు. అలాగే ఆ సర్వేలో దేశంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, మోదీ పాపులారిటీ పెరిగిందని చెప్పినట్టు శిందే గుర్తు చేశారు. మహారాష్ట్రలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తామే ముందంజలో ఉంటామని తెలిపారు. రాబోయే ఏడాదిన్నర పాటు ఒపీనియన్‌ పోల్స్‌ ఫలితాలు చూసి ఆస్వాదించేవారు ఆస్వాదించోచ్చని ఏక్‌నాథ్‌ అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని