అక్కడ తండ్రీకొడుకులు.. ఇక్కడ మామాఅల్లుళ్లు

రాజకీయాల్లో బంధుగణం కొత్తేం కాదు. తండ్రీకొడుకులు, అన్నదమ్ములు ఎన్నికల్లో పోటీ చేయడం.. గెలిచి అసెంబ్లీకి వెళ్లడం అప్పుడప్పుడు చూస్తుంటాం. తాజాగా జరిగిన తమిళనాడు, కేరళ

Published : 04 May 2021 01:07 IST

చెన్నై/తిరువనంతపురం: రాజకీయాల్లో బంధుగణం కొత్తేం కాదు. తండ్రీకొడుకులు, అన్నదమ్ములు ఎన్నికల్లో పోటీ చేయడం.. గెలిచి అసెంబ్లీకి వెళ్లడం అప్పుడప్పుడు చూస్తుంటాం. తాజాగా జరిగిన తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలా ఒకే ఇంటికి చెందిన నేతలు ఎన్నికల్లో విజయం సాధించారు. వీరిలో ఇద్దరు తండ్రీకొడుకులైతే.. మరో ఇద్దరు మామాఅల్లుళ్లు కావడం విశేషం.

మామ సీఎం.. అల్లుడు ఎమ్మెల్యే

కేరళ అసెంబ్లీ చరిత్రలోనే మామా అల్లుడు ఒకేసారి అసెంబ్లీకి ఎన్నికవడం ఇదే తొలిసారి కావడం విశేషం. వారెవరో కాదు.. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌.. ఆయన అల్లుడు మహ్మద్‌ రియాజ్‌. ఆదివారం వెలువడిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో విజయన్‌ కన్నూర్‌ జిల్లాలోని ధర్మదాం నియోజకవర్గం నుంచి 50వేల ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు. ఇక ఆయన అల్లుడు, డెమొక్రాటిక్‌ యూత్‌ ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా(డీవైఎఫ్‌ఐ) జాతీయాధ్యక్షుడు రియాజ్‌ సీపీఎం అభ్యర్థిగా కోజికోడ్‌లోని బేపోర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. గతంలో 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రియాజ్‌ కోజికోడ్‌ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే అప్పటికి వీరిమధ్య బంధుత్వం లేదు. విజయన్‌ కుమార్తె వీణను 2020 జూన్‌లో రియాజ్‌ వివాహం చేసుకున్నారు. 

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర రాజకీయ చరిత్రను తిరగరాస్తూ వరుసగా రెండోసారి విజయన్‌ అధికారపీఠాన్ని అధిరోహించనున్నారు. 

తమిళనాట కరుణానిధి వారసత్వం

ఇక తమిళనాడులో డీఎంకే ప్రభంజనం సృష్టించింది. దశాబ్దం తర్వాత స్టాలిన్‌ నేతృత్వంలో అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఇదే ఎన్నికల్లో డీఎంకే యువ నేత, స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి కూడా పోటీ చేశారు. తన తాత సొంత నియోజకవర్గం చెపాక్‌ నుంచి బరిలోకి దిగి అరంగేట్ర ఎన్నికల్లోనే అద్భుత విజయాన్ని నమోదు చేశారు. దీంతో తండ్రీకుమారులు ఒకేసారి అసెంబ్లీలో కన్పించనున్నారు. డీఎంకే జయభేరీతో స్టాలిన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని