మాజీ సీఎం నారాయణస్వామికి కాంగ్రెస్‌ షాక్‌!

పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామికి కాంగ్రెస్‌ పార్టీ షాకిచ్చింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ఇన్‌ఛార్జి దినేశ్‌ గుండురావ్‌ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

Updated : 17 Mar 2021 11:13 IST

చెన్నై: పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామికి కాంగ్రెస్‌ పార్టీ షాకిచ్చింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ఇన్‌ఛార్జి దినేశ్‌ గుండురావ్‌ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయబోయే 14 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలోనూ నారాయణస్వామి పేరును పార్టీ ప్రకటించకపోవడం గమనార్హం. 

‘మాజీ సీఎం నారాయణస్వామి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. పార్టీ తరపున ప్రచారం, ఎన్నికల నిర్వహణ బాధ్యతలను ఆయన చూసుకుంటారు’అని దినేశ్‌ వెల్లడించారు. ప్రస్తుతం ప్రకటించిన 14 మందిలో కీలక అభ్యర్థులు సెల్వనదనె(కర్దిర్‌గామమ్), ఎం కన్నన్(ఇందిరానగర్‌)‌, కార్తీకేయన్‌(ఒస్సుదు) ఉన్నారు. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని 30 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్‌ 6న ఎన్నికలు జరగనున్నాయి. కాగా, పుదుచ్చేరిలో నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్ల గడువు ముగియకముందే గతనెలలో పడిపోయిన విషయం తెలిసిందే. అధికార పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో.. అసెంబ్లీలో కాంగ్రెస్‌ సంఖ్యా బలం తగ్గి ప్రభుత్వం పడిపోయింది. నారాయణస్వామి అసెంబ్లీలో బలం నిరూపించుకోవడంలో విఫలమవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని