Congress Chief Poll: అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో ఆశ్చర్యపోవడం పక్కా: శశిథరూర్‌

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి మల్లిఖార్జున ఖర్గేకు మాత్రమే ఓటేయమని ఓటర్లకు సీనియర్ల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ.. రహస్య బ్యాలెట్‌ పత్రాల్లో మాత్రం వారు తనకే ఓటు వేస్తారని అన్నారు.

Published : 12 Oct 2022 01:14 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి మల్లిఖార్జున ఖర్గేకు మాత్రమే ఓటేయమని ఓటర్లకు సీనియర్ల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ.. రహస్య బ్యాలెట్‌ పత్రాల్లో మాత్రం వారు తనకే ఓటు వేస్తారని అన్నారు. ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. ఈ సారి అధ్యక్ష ఎన్నికలు 1997, 2000లో జరిగిన విధంగా ఉండవని, ఈ సారి పోరు ఏకపక్షంగా ఉండబోదని చెప్పారు. అలా అనుకున్నవారంతా ఓట్ల లెక్కింపు రోజున ఆశ్చర్యపోక తప్పదన్నారు. అంతేకాకుండా ఎన్నికలను రహస్య బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానం ద్వారా నిర్వహిస్తామని కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల అథారిటీ బహిరంగ ప్రకటన చేయాలన్నారు. పోలింగ్‌ పూర్తయిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులకు సీల్‌ చేసి.. ఇరు పక్షాల అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలోనే వాటిని తెరవాలని అన్నారు.

కొందరు నాయకులు ప్రచారంలో పాల్గొనేందుకే భయపడుతున్నారు కదా.. వాళ్లంతా మీకే ఓటు వేస్తారని ఎలా అనుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. ‘‘ఆ విషయం నాకు తెలుసు. కొన్ని కారణాల వల్ల వారంతా బహిరంగంగా మద్దతు తెలపరు. నా ప్రచార కార్యక్రమాలకు కూడా హాజరవ్వడం లేదు. కానీ, అంతర్గతంగా నాకే మద్దతు ప్రకటిస్తున్నారు. పార్టీలోని కొందరు నాయకులు నా ప్రత్యర్థికి మద్దతివ్వమని ఒత్తిడి తెస్తున్నారు. కానీ, వారందరి మద్దతు నాకే ఉంటుంది’’ అని శశిథరూర్‌ వ్యాఖ్యానించారు. 1997 ఎన్నికల్లో  సీతారామ్‌ కేసరి, శరద్‌ పవార్‌, రాజేశ్‌ పైలట్‌ మధ్య త్రిముఖ పోరు జరిగింది. ఈ ఎన్నికల్లో అధిష్ఠానం మద్దతున్న కేసరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరోసారి 2000లో నిర్వహించిన ఎన్నికల్లో  సోనియాగాంధీపై పోటీ చేసిన జితేంద్ర ప్రసాద ఘోర పరాజయం పాలయ్యారు. అయితే ఈసారి కచ్చితంగా అలా ఉండబోదని శశిథరూర్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు సైద్ధాంతిక పరమైన విభేదాలు లేవని థరూర్‌ అన్నారు. 2014, 2019 ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకుండా పార్టీని ఎవరు విజయతీరాలకు చేరుస్తారు? ఓటర్లను తిరిగి తమవైపు మలచుకునేందుకు సరైన నాయకుడు ఎవరు?అన్నదే ఈ నెల 17న జరగనున్న ఎన్నికల్లో తేలుతుందని ఆయన అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు